Sena Vs Sena: గుర్తు కేటాయింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం
ABN , First Publish Date - 2022-08-23T22:07:38+05:30 IST
పార్టీ గుర్తుపై శివసేన వర్గాల వాదనలను రాజ్యంగ విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు మంగళవారంనాడు..
న్యూఢిల్లీ: పార్టీ గుర్తుపై శివసేన వర్గాల వాదనలను రాజ్యంగ విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు (Supreme court) మంగళవారంనాడు అప్పగించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మధ్య పార్టీ గుర్తు (party symbol) విషయంలో నడుస్తున్న పోరాటానికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలను విస్తృత ధర్మసనం (Larger constitutional bench) ముందు అత్యున్నత న్యాయస్థానం ఉంచింది. గుర్తు కేటాయింపు వ్యవహారంపై వచ్చే గురువారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ (Election commission)ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఈనెల 25న దీనిపై విచారణ జరుపనుంది.
''గురువారంనాడు విస్తృత ధర్మాసనం ముందు ఈ అంశం విచారణకు వస్తుంది. పార్టీ గుర్తుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్‌ను బెంచ్ నిర్ణయిస్తుంది'' అని సీజేఐ ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమా కోహ్లితో కూడిన బెంచ్ మంగళవారంనాడు పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత, ఇతర సాంకేతిక అంశాలపై ఉద్ధవ్, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ సాగిస్తోంది.
ఉద్ధవ్ థాకరే దాఖలు చేసిన అన్ని పిటిషన్లను తోసిపుచ్చాలని, నిజమైన శివసేనను నిర్ణయించే విషయం ఎన్నికల కమిషన్‌కు విడిచిపెట్టాలని గత నెలలో సుప్రీంకోర్టును షిండే కోరారు. తమకు సభ్యుల సంఖ్యాబలం ఉందని, పార్టీ అంతర్గత నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని తన పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలలో 39 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు శివసేన వర్గం నేత షిండే పక్షాన నిలబడంతో థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వ గత జూన్‌లో కుప్పకూలింది. అనంతరం బీజేపీ మద్దతుతో షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.