Jammu: జమ్మూలో ఉగ్ర కుట్ర భగ్నం
ABN , First Publish Date - 2022-10-27T17:50:36+05:30 IST
జమ్మూ: జమ్మూలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
జమ్మూ: జమ్మూలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ రైల్వే స్టేషన్ (Jammu Railway Station) దగ్గర ట్యాక్సీ స్టాండ్ సమీపంలో అనుమానాస్పద సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచిలో రెండు పెట్టెలున్నాయని వాటిలో 18 డిటోనేటర్లు (18 detonators), వైర్లు, ఇతర పేలుడు సామాగ్రి (Explosive materials) ఉన్నట్లు సీనియర్ ఎస్పీ ఆరిఫ్ రిషు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శ్రీనగర్‌లో ‘శౌర్య దినోత్సవాల’లో పాల్గొన్న సమయంలోనే జమ్మూలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన (Indian Air Force) శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌లలో అభివృద్ధి ప్రస్థానాన్ని ఇప్పుడే మొదలుపెట్టామని రాజ్‌నాథ్ చెప్పారు. గిల్గిట్-బాల్టిస్థాన్‌ను చేరుకుంటే భారత లక్ష్యం నెరవేరుతుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీరు ప్రజలపై పాకిస్థాన్ (Pakistan) దురాగతాల గురించి ప్రస్తావిస్తూ, పొరుగు దేశం దాని పర్యవసానాలను అనుభవించవలసి వస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారత దేశాన్ని టార్గెట్ చేయడమేనని చెప్పారు.
జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో దీనిని రద్దు చేయడం వల్ల జమ్మూ-కశ్మీరు ప్రజలపై వివక్ష అంతమైందని చెప్పారు.