Afghanistan : తాలిబన్ల రాజ్యంలో మళ్ళీ నడిరోడ్డుపై ఉరితీతలు, కొరడా దెబ్బలు

ABN , First Publish Date - 2022-11-16T19:50:07+05:30 IST

తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్ళీ బహిరంగ ఉరితీతలు, కాళ్ళు, చేతులు విరగ్గొట్టడం, కొరడా దెబ్బలు

Afghanistan : తాలిబన్ల రాజ్యంలో మళ్ళీ నడిరోడ్డుపై ఉరితీతలు, కొరడా దెబ్బలు
Afghanistan

కాబూల్ : తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్ళీ బహిరంగ ఉరితీతలు, కాళ్ళు, చేతులు విరగ్గొట్టడం, కొరడా దెబ్బలు కనిపించబోతున్నాయి. షరియా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని న్యాయమూర్తులందరినీ తాలిబన్లు ఆదేశించారు. దీంతో ఇప్పటికే దయనీయ స్థితిలో ఉన్న ఆఫ్ఘన్ల మానవ హక్కులు మరింత క్షీణిస్తాయనే ఆందోళన తీవ్రమవుతోంది.

తాలిబన్ (Talibans) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం, దొంగతనాలు, వ్యక్తుల అపహరణలు, దేశద్రోహులకు సంబంధించిన కేసులపై విచారణ జరిపేటపుడు షరియా (Sharia) చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని న్యాయమూర్తులను ఆఫ్ఘనిస్థాన్ సుప్రీం లీడర్ (Afghanistan Supreme Leader) అలైకడర్ అమిరుల్ మొమినీన్ ఆదేశించారు. షరియా చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో ఆ చట్టం ప్రకారమే శిక్షలు విధించాలని తెలిపారు. షరియా ప్రకారం ఇది తప్పనిసరి అని చెప్పారు. న్యాయమూర్తులతో సమావేశం అనంతరం సుప్రీం లీడర్ ఈ ఆదేశాలిచ్చారు.

పెల్లుబుకుతున్న ఆందోళన

తాలిబన్లు మొదటిసారి 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించారు. అప్పట్లో బహిరంగ ఉరితీత, రాళ్ళతో కొట్టడం, కొరడా దెబ్బలు, అవయవాల తొలగింపు వంటి శిక్షలను అమలు చేశారు. కొన్ని రకాల సంగీతాన్ని నిషేధించారు. గత ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)ను స్వాధీనం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ మద్దతు కోసం మితవాదులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ రాన్రానూ మానవ హక్కులను తుంగలో తొక్కడం ప్రారంభించారు. కొన్ని రంగాల్లో మహిళలు ఉద్యోగాలు, పనులు చేయకూడదని నిషేధం విధించారు. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే పురుషుడిని తోడుగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. బాలికలు సెకండరీ స్కూల్‌లో చదవడంపై నిషేధం విధించారు. గత వారం కాబూల్‌లోని పార్కుల్లోకి వెళ్ళకుండా మహిళలను అడ్డుకున్నారు.

షరియా చట్టం అంటే...

షరియా చట్టం (Sharia Law)పై గట్టి పట్టు ఉన్న ప్రొఫెసర్ కహెల్డ్ అబౌ ఎల్ ఫాది తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ చట్టానికి నిర్దిష్టమైన పరిమితులేవీ లేవు. ఈ చట్టానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రతి అంశానికి 10 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇస్లామిక్ న్యాయం పరిధిలో షరియా చట్టం అంటే దైవ నిర్ణయం కోసం అన్వేషించడం. షరియా అంటే ఇస్లామిక్ చట్టం అని, ఇస్లామిక్ చట్టం అంటే షరియా అని సాధారణంగా వాడుతూ ఉంటారు. కానీ షరియా చాలా విస్తృతమైనది. దీనిలోకి అన్నీ వస్తాయి.

ఐక్య రాజ్య సమితి స్పందన

ఐక్యరాజ్య సమితి (United Nations) సెక్రటరీ జనరల్‌కు డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ మాట్లాడుతూ, షరియా చట్టం అమలు గురించి తాలిబన్లు చేసిన ప్రకటన ఆందోళనకరమని చెప్పారు. గత ఏడాది ఆగస్టులో అధికారం చేపట్టిన తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో మానవ హక్కుల పరిరక్షణకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశించినట్లు తెలిపారు. కానీ అందుకు తగినట్లు వారు ప్రవర్తించడం లేదన్నారు. ఈ విషయంలో తాము వారిపై ఒత్తిడిని కొనసాగిస్తామన్నారు. అన్ని రూపాల్లోని మరణ శిక్షలను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.

ఆకలి కేకలు

తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ దయనీయ పరిస్థితుల్లోకి జారుకుంటోంది. ప్రపంచంలో ఏకాకిగా మారుతోంది. పేదరికంలో మగ్గుతోంది. దాదాపు సగం జనాభా ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు 43 శాతం మంది రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోగలుగుతున్నట్లు ఐక్య రాజ్య సమితి వెల్లడించింది.

Updated Date - 2022-11-16T20:16:48+05:30 IST