Tawang Face-off : తవంగ్ ఘర్షణపై అసలు నిజం చెప్పేసిన స్థానికుడు
ABN , First Publish Date - 2022-12-13T13:18:23+05:30 IST
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో వాస్తవాధీన రేఖ (LAC)ని ఉల్లంఘించేందుకు చైనా దళాలు
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ సెక్టర్‌లో వాస్తవాధీన రేఖ (LAC)ని ఉల్లంఘించేందుకు చైనా దళాలు విఫలయత్నం చేశాయి. యాంగ్‌త్సే ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణ గురించి స్థానికుడొకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంతతను దెబ్బతీయడం చైనాకు అలవాటేనని చెప్పారు. చైనా ప్రయత్నాలను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టగలదని చెప్పారు. భారత సైన్యం మనల్ని కాపాడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. భారత భూభాగంలోకి చైనా ప్రవేశించగలదని తాను అనుకోవడం లేదన్నారు. మన భూభాగంలో కనీసం ఒక అంగుళం అయినా ఆక్రమించుకోవడం చైనాకు సాధ్యం కాదన్నారు. తాము నిరంతరం భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. అవసరమైతే తాము కూడా భారత సైన్యంతో కలిసి చైనాకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. డిసెంబరు 9న జరిగిన ఘర్షణలో చైనా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
భారత సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై డిసెంబరు 9న దాడి చేశారు. ఇరు దేశాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు భారత సైనికులు గాయపడగా, వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. చైనా సైనికులు ఎక్కువ మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. యాంగ్‌త్సే ప్రాంతంలో యథాతథ స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని, దీనిని మన రక్షణ దళాలు దీటుగా తిప్పికొట్టాయని, చైనా సైన్యాన్ని తరిమికొట్టాయని చెప్పారు. 2022 డిసెంబరు 9న జరిగిన ఈ సంఘటనలో భారతీయ సైనికులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చెప్పారు. ఎటువంటి అతిక్రమణలనైనా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత సైన్యానికి ఉందన్నారు.
అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval), భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే సమావేశమయ్యారు. ప్రస్తుతం తవంగ్‌లో ఉన్న పరిస్థితిని వివరించారు.