J&K: గ్రామాన్ని విడిచిపెట్టిన చివరి కశ్మీరీ పండిట్ మహిళ

ABN , First Publish Date - 2022-10-28T16:06:23+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ

J&K: గ్రామాన్ని విడిచిపెట్టిన చివరి కశ్మీరీ పండిట్ మహిళ
jammu kashmir

జమ్మూ : జమ్మూ-కశ్మీరులోని షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామం నుంచి చిట్ట చివరి కశ్మీరీ పండిట్ మహిళ డోలీ కుమారి ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. గురువారం సాయంత్రం ఆమె జమ్మూకు వలస వెళ్లిపోయారు. ఇటీవల కశ్మీరు లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరుగుతుండటంతో ఈ గ్రామంలో మిగిలిన ఏడు కశ్మీరీ పండిట్ కుటుంబాలు నెమ్మదిగా జమ్మూకు వలసపోయారు.

డోలీ కుమారి మాట్లాడుతూ లోయలో భయానక వాతావరణం ఉందని, ఇంతకన్నా తాను ఏమి చేయగలనని వాపోయారు. మిగిలిన హిందూ కుటుంబాలు ఈ గ్రామాన్ని విడిచిపెట్టినప్పటికీ, తాను కొద్ది రోజులపాటు ధైర్యంగానే తన ఇంట్లో ఉన్నట్లు తెలిపారు. పరిస్థితి మెరుగుపడితే తాను తిరిగి స్వగ్రామానికి వస్తానని చెప్పారు. ఇది తన సొంతిల్లు అని చెప్పారు. సొంతింటిని వదిలిపోవడానికి ఎవరు ఇష్టపడతారని ప్రశ్నించారు. తన సొంతింటిని విడిచి వెళ్లిపోతుండటం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదులు కశ్మీరు లోయలోని హిందువులను వెతికి మరీ చంపుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 15న ఈ గ్రామానికి చెందిన పురాణ్ కృషన్ భట్‌ను తన ఇంటి బయటే ఉగ్రవాదులు చంపేశారు. రెండు నెలల క్రితం షోపియాన్ జిల్లాలోని చోటీగామ్ గ్రామంలో ఓ కశ్మీరీ పండిట్‌ను చంపేశారు.

‘‘మీ పక్కనే ఇలాంటి భయానక సంఘటనలు జరుగుతూ ఉంటే మీరు భయపడరా? చెప్పండి?’’ అని డోలీ కుమారి ప్రశ్నించారు.

Updated Date - 2022-10-28T16:13:17+05:30 IST