TNCC: కాంగ్రెస్‌లో విభేదాలు..
ABN , First Publish Date - 2022-11-20T09:54:54+05:30 IST
టీఎన్‌సీసీ(TNCC) అధ్యక్షుడు కేఎస్ అళగిరికి వ్యతిరేకంగా మాజీ నేతలు పావులు కదుపుతున్నారు. నిన్నమొన్నటిదాకా అళగిరికి గట్టి మద్దతుదారులుగా
- కేఎస్ అళగిరిపై మాజీ నేతల తిరుగుబాటు
- ఇందిర జయంతిలో బహిర్గతం... వేర్వేరుగా నివాళులు
చెన్నై, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): టీఎన్‌సీసీ(TNCC) అధ్యక్షుడు కేఎస్ అళగిరికి వ్యతిరేకంగా మాజీ నేతలు పావులు కదుపుతున్నారు. నిన్నమొన్నటిదాకా అళగిరికి గట్టి మద్దతుదారులుగా వ్యహరించిన మాజీ నేతలు ఎస్.తిరునావుక్కరసర్, ఈవీకేఎస్ ఇళంగోవన్, కేవీ తంగబాలు ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఉదయం జరిగిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో అళగిరిపై వారి తిరుగుబాటు బహిర్గతమైంది. దివంగత నేత ఇందిరకు వేర్వేరుగా నివాళులర్పించి తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. మాజీ నేతల తిరుగుబాటుకు ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్ వద్ద జరిగిన ఘర్షణలే కారణమని తెలుస్తోంది. ఈ నెల 15 రాత్రి సత్యమూర్తి భవన్‌లో జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశం సందర్భంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి(KS Alagiri) అనుచరులకు, నాంగునేరి కాంగ్రెస్ శాసనసభ్యుడు రూబీ మనోహరన్ అనుచరులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి రూబీ మనోహరన్, కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రంజన్‌కుమార్‌పై చర్యలు చేపట్టే నిమిత్తం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మూడు రోజుల తర్వాత టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులంతా కేఎస్ అళగిరికి వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం. ఈ విషయం శనివారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా బహిర్గతమైంది. ఇందిరా జయంతిని పురస్కరించుకుని పార్టీ తరపున ఓ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు ఆహ్వానపత్రంలో టీఎన్‌సీసీ మాజీ నేతల పేర్లు ఉన్నప్పటికీ వారెవరూ హాజరుకాలేదు. ఇదే విధంగా స్థానిక వాల్‌టాక్స్ రోడ్డులో ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమంలో టీఎన్‌సీసీ నేత అళగిరి, మాజీ నేతలు అందరూ పాల్గొంటారని ఆహ్వానపత్రాలు ముద్రించారు, నగరమంతటా పోస్టర్లు కూడా వేశారు. అయితే శనివారం ఉదయం తొలుత ఆ విగ్రహానికి అళగిరి, ఆయన మద్దతుదారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరంతా వెళ్ళిపోయిన అరగంట తర్వాత టీఎన్‌సీసీ మాజీ నేతలు కేవీ తంగబాలు, ఈవీకేఎస్ ఇళంగోవన్, ఎం.కృష్ణసామి, సీఎల్పీనేత సెల్వపెరుందగై, నాసే రామచంద్రన్, రంగభాష్యం, ఎంఎస్ ద్రవియం తదితరులు వచ్చి ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఇదే విధంగా సత్యమూర్తి భవన్‌లో అళగిరి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నిర్వాహకుల చేత దేశ సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ్‌వసంత్, ఆర్. దామోదరన్, చిరంజీవి, సుమతి అన్బరసు, శివ రాజశేఖరన్, అడయార్‌డి దురై, ఎంఎస్ ద్రవియం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి, ఆ తర్వాత జరిగిన సదస్సుకు టీఎన్‌సీసీ మాజీ నేతలెవరూ హాజరుకాలేదు.