టీటీఈ, గార్డును ఫ్లాట్‌ఫాంపై వదిలేసి వెళ్లిపోయిన రైలు

ABN , First Publish Date - 2022-10-27T16:24:41+05:30 IST

స్టేషన్‌లో ఆగిన ఓ రైలు టీటీఈ (TTE), గార్డు (Gaurd)ను ప్లాట్‌ఫాంపైనే వదిలేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో

టీటీఈ, గార్డును ఫ్లాట్‌ఫాంపై వదిలేసి వెళ్లిపోయిన రైలు

భువనేశ్వర్: స్టేషన్‌లో ఆగిన ఓ రైలు టీటీఈ (TTE), గార్డు (Gaurd)ను ప్లాట్‌ఫాంపైనే వదిలేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒడిశాలోని కోరాపుట్ రైల్వే స్టేషన్‌(Koraput station)లో జరిగిందీ ఘటన. రైలు తమను విడిచి వెళ్లిపోతుండడంతో దిగ్భ్రాతికి గురైన టీటీఈ, గార్డు చేయి ఊపుతూ కాస్తంత దూరం నడిచి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఆ తర్వాత వాకీటాకీ ద్వారా లోకోపైట్‌తో గార్డు మాట్లాడి విషయం చెప్పాడు. దీంతో కంగుతిన్న లోకోపైలట్ రైలుకు బ్రేకులు వేశాడు. దీంతో ఉసూరుమంటూ వారిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కారు.

అంతకుముందు ఏం జరిగిందంటే.. కిరండుల్-విశాఖపట్టణం రైలులోని ఓ కోచ్‌లో చెత్త ఎక్కడపడితే అక్కడే ఉందని, బోగీ మురికిగా ఉందని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. రైలు కోరాపుట్ రైల్వే స్టేషన్‌లో ఆగిన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది ప్రయాణికుడితో మాట్లాడుతున్నారు. దీంతో టీటీఈ, గార్డు కిందకు దిగి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో రైలు కదిలి ఆ వెంటనే వేగం పుంజుకుంది. ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయిన టీటీఈ లోకోపైలట్ వైపు చూస్తూ చేతులు ఊపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గార్డు వెంటనే తన వద్దనున్న వాకీటాకీతో లోకోపైలట్‌కు సమాచారం అందించాడు. అప్పటికే చాలాదూరం వెళ్లిపోయిన రైలుకు లోకోపైలట్ బ్రేకులు వేశాడు. దీంతో టీటీఈ, గార్డు పరుగు పరుగున వెళ్లి రైలుకెక్కారు.

Updated Date - 2022-10-27T16:52:50+05:30 IST