రైలు పట్టాలపై రాళ్లు
ABN , First Publish Date - 2022-03-21T16:22:19+05:30 IST
కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలో శనివారం రాత్రి పట్టాలపై ఉన్న రెండు పెద్ద బండరాళ్ళను ఢీకొన్న ఘటనలో గురవాయూర్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైలును
- గురవాయూర్ ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం
- విద్రోహ చర్యగా అనుమానం
- విచారణ జరుపుతున్న రైల్వే భద్రతా దళం
చెన్నై: కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలో శనివారం రాత్రి పట్టాలపై ఉన్న రెండు పెద్ద బండరాళ్ళను ఢీకొన్న ఘటనలో గురవాయూర్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైలును కూల్చేందుకు చేసిన విద్రోహ చర్యగా రైల్వే భద్రతాధికారులు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి గురువాయూరుకు నాగర్‌కోవిల్ మీదుగా ప్రతిరోజూ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు. ఆ మేరకు శనివారం ఉదయం చెన్నై నుంచి బయల్దేరిన గురువాయూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 9.30 గంటలకు నాగర్‌కోవిల్ రైల్వేస్టేషన్ చేరింది. అక్కడి నుంచి రాత్రి పదిగంటలకు గురువాయూరు బయల్దేరింది. ఇరానియల్-కుళిత్తురై మధ్య పాలకోడి సమీపంలో పట్టాలపై ఉంచిన రెండు పెద్ద బండరాళ్ళను రైలు ఢీకొంది. ఆ శబ్దానికి ప్రయాణికులంతా భీతిల్లారు. లోకోపైలట్ వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రైల్వే సీఐ కేథరిన్ సుజాత, ఎస్‌ఐలు కుమార్‌రాజ్, పళనియప్పన్ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. రైలు పట్టాలపై రెండు పెద్ద బండరాళ్ళు ముక్కలై పడి ఉండటాన్ని గమనించారు. దుండగులెవరో ఆ బండరాళ్ళను పట్టాలపై ఉంచి గురువాయూరు ఎక్స్‌ప్రెస్ ను కూల్చేందుకు కుట్రపన్ని ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. పట్టాలపై బండ రాళ్ళను ఢీకొట్టిన రైలు సుమారు 600 మీటర్ల వరకు రాళ్ళ ముక్కలను తోసుకెళ్ళినట్లు పోలీసు అధికారులు గమనించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసు ఉన్నతాధికారులు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వీడియో ఆధారాలను పరిశీలిస్తున్నారు. పట్టాలపై ఉన్న బండరాళ్ల ముక్కలను రైల్వే సిబ్బంది తొలగించారు. ఆ తర్వాత ఆదివారం వేకువ జామున గురువాయూరు ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. ఆదివారం ఉదయం నుండి ఆ మార్గంలో యధావిధిగా రైళ్ళు నడిచాయి.
ఇంజన్ లోపంతో ఆగిన రైలు...
ఇదిలా ఉండగా శనివారం అర్ధరాత్రి దిండుగల్ సమీపంలో పళని వెళుతున్న ఎక్స్‌ప్రెస్ ఇంజన్ లోపం కారణంగా అర్థాంతరంగా ఆగింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. చెన్నై నుంచి పళనికి శనివారం రాత్రి తొమ్మిదిగంటలకు ఆ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. దిండుగల్ స్టేషన్‌లో కాసేపు ఆగిన తర్వాత పళని వెళుతుండగా సత్తిరపట్టి వద్ద హఠాత్తుగా ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి ఆగిపోయింది. వెంటనే లోకోపైలట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని రైలింజన్‌ను మరమ్మతు చేశారు. రెండు గంటల తర్వాత ఆ రైలు అక్కడి నుంచి పళనికి బయల్దేరింది.