Himachal Pradesh Results : బీజేపీ ఓటమితో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పదవీ గండం?

ABN , First Publish Date - 2022-12-09T20:15:06+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నేత జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రి

Himachal Pradesh Results : బీజేపీ ఓటమితో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పదవీ గండం?
Anurag Thakur

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నేత జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అందరి చూపూ ఆయనపైనే ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 25 స్థానాలు, కాంగ్రెస్‌కు 40 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.

అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని ఐదు శాసన సభ స్థానాల్లో కేవలం ఒక స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఇది ఆయనకు తీవ్ర నిరాశను కలిగించింది. ఆయన తండ్రి ప్రేమ్ కుమార్ ధుమల్ గతంలో రెండుసార్లు (2008 నుంచి 2012 వరకు, 1998 నుంచి 2003 వరకు) ముఖ్యమంత్రిగా పని చేశారు. 2017లో ఆయనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈసారి ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఫలితంగా ఆయన మద్దతుదారుల మనసు గాయపడింది. కన్నీటిపర్యంతమైన అనురాగ్ ఠాకూర్ తన తండ్రి కఠోర శ్రమ చేశారని ప్రశంసించారు. అయితే తాను రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని ధుమల్‌ చెప్పారు, అదే విషయాన్ని బీజేపీ కూడా చెప్తూ వచ్చింది.

అనురాగ్ తన సొంత జిల్లాలో బీజేపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తండ్రి కూడా బీజేపీకి మద్దతుగా నిలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారే. అయితే ధుమల్, నడ్డా మద్దతుదారుల మధ్య విభేదాలు ఉన్నాయి. అనురాగ్ వీరిద్దరి మధ్య ఇరుక్కున్నారు. తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ధుమల్ వర్గం బీజేపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉంది. పార్టీ రాష్ట్ర విభాగంలో తిరుగుబాట్లను నియంత్రించడంలో కానీ, పైకి కనిపించని ధుమల్ ఫ్యాక్టర్‌ను సంభాళించడంలో కానీ అధిష్ఠానం విఫలమైందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

హమీర్‌పూర్ జిల్లాలో బీజేపీ ఓటమికి బాధ్యుడు అనురాగ్ ఠాకూరేనని అనేక మంది ట్విటర్‌ వేదికగా దుయ్యబడుతున్నారు. కేవలం నరేంద్ర మోదీ ఆకర్షణతోనే విజయం సాధిస్తామనే దృక్పథం వల్ల పార్టీ దెబ్బతిందని చెప్తున్నారు. మోదీ మ్యాజిక్ కన్నా ఎక్కువ ఏదో అవసరమంటున్నారు.

Updated Date - 2022-12-09T20:15:10+05:30 IST