NRI: ఎన్నారై వ్యాపారవేత్తకు షాక్.. అల్లుడిని నమ్మితే చివరకు..

ABN , First Publish Date - 2022-11-25T19:59:49+05:30 IST

అల్లుడు చేసిన మోసం కారణంగా దుబాయ్‌లోని ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు భారీ షాక్ తగిలింది.

NRI: ఎన్నారై వ్యాపారవేత్తకు షాక్..  అల్లుడిని నమ్మితే చివరకు..

ఎన్నారై డెస్క్: అల్లుడు చేసిన మోసం కారణంగా దుబాయ్‌లోని(Dubai) ఓ ఎన్నారై వ్యాపారవేత్తకు(NRI Business man) భారీ షాక్ తగిలింది. ఏకంగా రూ. 107 కోట్లు నష్టపోయిన ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేరళలో(Kerala) వెలుగుచూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్ లహీర్ హసన్..దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటారు. 2017లో ఆయన కుమార్తె.. కేరళ రాష్ట్రం కాసరగోడ్‌కు చెందిన ముహమ్మద్ హఫీజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తరువాత అల్లుడు తన మోసాలకు(Fraud) తెరలేపాడు. సుమారు ఐదేళ్ల క్రితం హఫీజ్..తనపై ఈడీ రైడ్లు జరిగాయని హసన్‌కు తెలిపాడు. ఈడీకి జరిమానా కట్టాలంటూ మామ నుంచి రూ. 4 కోట్లు తీసుకున్నాడు. అది మొదలు రకరకాల సాకులు చెబుతూ హఫీజ్ తన మామ హసన్ నుంచి రూ.92 కోట్లు రాబట్టాడు. అయితే.. మూడు నెలల క్రితం తాను మోసపోయాన్న విషయం హసన్‌కు అర్థమై అలువా పోలీసులను ఆశ్రయించాడు.

తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులను కూడా గట్టుచప్పుడు కాకుండా అల్లుడు తన పేర మార్చుకున్నట్టు హసన్ ఫిర్యాదు చేశారు. తన నుంచి అల్లుడు మొత్తం రూ.107 కోట్లు దోచుకుపోయాడని(Rob) ఆరోపించారు. అంతేకాకుండా.. కూతురికి బహుమతిగా ఇచ్చిన బంగారం మొత్తాన్ని హస్తగతం చేసుకున్నాడని హసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హసన్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులపై మండిపడ్డారు. అతడిని అరెస్ట్ చేయలేకపోయారని, కనీసం ప్రశ్నించేందుకు కూడా రప్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇది వంద కోట్ల పైబడిన సంపదనకు సంబంధించింది కావడంతో..నవంబర్ 24న కేసు కేరళ క్రైం బ్రాంచ్ విభాగానికి బదిలీ అయ్యింది. ప్రస్తుతం హఫీజ్ గోవాలో ఉన్నట్టు సమాచారం. కాగా.. హసన్ తన ఫిర్యాదులో అల్లుడి పేరుతో పాటూ అతడికి సహకరించిన అక్షయ్ థామస్ వైద్యన్ అనే వ్యక్తిని కూడా ప్రస్తావించారు.

Updated Date - 2022-11-25T20:02:42+05:30 IST