Online Scammers: బహ్రెయిన్ వెళ్లే ప్రవాసులు బహుపరాక్.. అలా చేశారో రోడ్డున పడతారు..!
ABN , First Publish Date - 2022-12-27T10:26:35+05:30 IST
ఉపాధి, ఉద్యోగాల కోసం బహ్రెయిన్ (Bahrain) వెళ్తున్న వలసదారులను (Expats) ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలతో ఆన్‌లైన్ స్కామర్లు (Online Scammers) ఘోరంగా మోసం చేస్తున్నాయి.
మనామా: ఉపాధి, ఉద్యోగాల కోసం బహ్రెయిన్ (Bahrain) వెళ్తున్న వలసదారులను (Expats) ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలతో ఆన్‌లైన్ స్కామర్లు (Online Scammers) ఘోరంగా మోసం చేస్తున్నాయి. వాట్సాప్ సందేశాలు (WhatsApp Message) పంపడం ద్వారా ఆశావహులను సులువుగా బుట్టలో వేసుకుని చివరకు నిండా ముంచుతున్నాయి. పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలను (Jobs) ఆఫర్ చేస్తూ ప్రవాసులను ఆకర్షించి ఆ తర్వాత మోసానికి పాల్పడుతున్నాయని ఎన్నారై కౌన్సిల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మోసపూరిత ప్రకటనల బారిన పడుతున్న ప్రవాసులు ఒకనొక సమయంలో రోడ్డున పడుతున్నారని చెప్పారు. ఇక అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి అలాంటి కంపెనీలు బాధ్యత వహించకుండా చేతు దులుపుకుంటున్నాయని వరల్డ్ ఎన్నారై కౌన్సిల్‌కు చెందిన మిడిల్ ఈస్ట్ రీజియన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ డైరెక్టర్ సుధీర్ తిరునిలత్ అన్నారు.
కాగా, ఇలా స్కామర్ల మోసాలకు బలి అవుతున్న వారిలో చాలామంది విజిట్ వీసాలపై (Visit Visas) పనికోసం వస్తున్నవారేనని అధికారి తెలిపారు. ముఖ్యంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సేల్స్ డిగ్రీలు ఉన్నవారిని ఉద్యోగాల కోసం బహ్రెయిన్‌కు రప్పించి అందినకాడికి దండుకుంటారు. ఆ తర్వాత వారిని 100 నుంచి 200 బహ్రెయినీ దినార్లు (రూ. 22వేల నుంచి 44వేల వరకు) ఇచ్చే ఉద్యోగాల్లో నియమించడం జరుగుతుంది. ఇలా మోసపోయిన వారు దేశ బహిష్కరణ (Deportion) భయంతో నిందితులపై ఫిర్యాదు చేయకపోవడంతో కేటుగాళ్లపై చర్యలు తీసుకోవడానికి వీలు పడడం లేదని సంబంధిత అధికారులు చెప్పారు. ఏదైమైనా ఇలాంటి వాటి పట్ల ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని, దేశంకాని దేశంలో ఇబ్బందులు పడొద్దని అధికారులు చెప్పుకొచ్చారు.