NRI: ఆ విషయంపై పునరాలోచించండి..బ్రిటన్‌కు భారత విద్యార్థుల సంఘం సూచన!
ABN , First Publish Date - 2022-11-26T21:17:14+05:30 IST
బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల సంఘం నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఆలమ్నీ యూనియన్(ఎన్ఐఎస్ఏయూ) బ్రిటన్ ప్రభుత్వానికి కీలక అభ్యర్థన చేసింది.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లోకి(UK) వలసలను తగ్గించేందుకు విదేశీ విద్యార్థుల రాకడను(Curbs on Foreign students) కట్టిడి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. భారతీయుల్లో ఈ విషయమై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల సంఘం నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఆలమ్నై యూనియన్(ఎన్ఐఎస్ఏయూ-NISAU) బ్రిటన్ ప్రభుత్వానికి కీలక అభ్యర్థన చేసింది. ఈ అంశంపై పునరాలోచించుకోవాలని సూచించింది. ‘‘చదువు కోసం తాత్కాలిక ప్రాతిపదికన బ్రిటన్‌కు వచ్చే విదేశీ విద్యార్థులను వలసదారులుగా చూడకూడదు’’ అని ఎన్ఐఎస్ఏయూ యూకే చైర్‌పర్సన్ సనమ్ అరోరా పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో బ్రిటన్‌లోకి వలసలు బాగా పెరిగిన వైనం అధికారిక గణాంకాల్లో తాజాగా వెల్లడైంది. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. 2021లో దేశంలోకి 1.73,000 మంది విదేశీయులు వలసొస్తే.. ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 5,04,000కి చేరింది. అంతర్జాతీయ విద్యార్థుల రాకడ పెరగడంతోనే వలసల్లో ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ముఖ్యంగా..బ్రిటన్‌లోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు చైనీయులను దాటి తొలిసారిగా నెం.1 స్థానాన్ని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ తారాస్థాయిలో జరుగుతోంది. ‘‘బ్రిటన్ వలస విధానంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరేలా అన్ని చర్యలను పరిశీలిస్తాం’’ అని రిషి సునాక్ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే.. భారతీయ విద్యార్థుల వల్ల బ్రిటన్‌కు 30 బిలియన్ పౌండ్ల నికర ఆదాయం చేకూరుతోందని ఎన్ఐఎస్ఏయూ యూకే చైర్‌పర్సన్ సనమ్ అరోరా తెలిపారు. బ్రిటన్, ఇండియా దేశాల మధ్య వాణిజ్య, దౌత్య, సాంస్కృతిక సంబంధాలు బలపడటంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఏయే యూనివర్శిటీలు ఉన్నతమైనవో తేల్చే విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. దిగువస్థాయి(Low Quality) డిగ్రీ కోర్సుల్లో చదివేందుకు బ్రిటన్ వచ్చే విదేశీ విద్యార్థులను(Foreign Students) అడ్డుకునేలా ఆంక్షలు విధించే యోచనలో ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. విదేశీయులపై ఆధారపడ్డ వారిని కూడా బ్రిటన్‌లోకి రాకుండా కట్టడి చేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీ వర్గాలు కూడా ప్రభుత్వ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ విద్యార్థులపై ఆంక్షలతో బ్రిటన్ పరపతి, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించాయి.