Singapore: విషాద ఘటన.. విధుల్లో ఉండగా సముద్రంలో పడి భారత వ్యక్తి మృత్యువాత!
ABN , First Publish Date - 2022-11-30T12:41:24+05:30 IST
సింగపూర్‌లో (Singapore) విషాద ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.
సింగపూర్ సిటీ: సింగపూర్‌లో (Singapore) విషాద ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.. నవంబర్ 25వ తేదీ ఉదయం11 గంటల ప్రాంతంలో మెర్లిమావు రోడ్‌లోని సింగపూర్ రిఫైనింగ్ కంపెనీలో (Singapore Refining Company) బాధితుడు విధుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. పరంజా (Scaffolding operations) పని చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు. 41 ఏళ్ల మృతుడు గతంలో ప్లాంట్ జనరల్ సర్వీసెస్‌లో (Plant General Services) పనిచేశాడు. ఈ ఘటనపై ఎంఓఎం(Ministry of Manpower) దర్యాప్తు చేస్తోంది.
ఇక ఈ ఘటన నేపథ్యంలో రిఫనరీల్లో పరంజా (Scaffolding operations) పనులను నిలిపివేయాలని బాధితుడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యానికి మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్‌పవర్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సముద్రాలు, భారీ నీటి వనరుల సమీపంలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు దృష్టి సారించాలని సూచంచింది. అయితే సింగపూర్‌లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో నిర్మాణ స్థలంలో జరిగిన క్రేన్ ప్రమాదంలో 32 ఏళ్ల భారతీయ కార్మికుడు చనిపోయిన విషయం తెలిసిందే.