విదేశీ కార్మికులకు ఖతర్ షాక్.. నోటీసులిచ్చి ఉన్న పళంగా..
ABN , First Publish Date - 2022-10-31T08:28:06+05:30 IST
ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్ తమ రాజధాని దోహాలోని విదేశీ కార్మికులను ఉన్న పళంగా ఖాళీ చేయిస్తోంది. రాత్రి వేళ అని కూడా చూడకుండా సామాన్లు..
విదేశీ కార్మికులూ.. ఖాళీ చేయండి
తక్షణమే నివాసాలను వదిలి వెళ్లండి.. ఖతర్ కఠిన నిర్ణయం
దోహా, అక్టోబరు 30: ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్ తమ రాజధాని దోహాలోని విదేశీ కార్మికులను ఉన్న పళంగా ఖాళీ చేయిస్తోంది. రాత్రి వేళ అని కూడా చూడకుండా సామాన్లు సర్దుకునేంత సమయం కూడా ఇవ్వకుండా కేవలం 2 గంటల ముందు నోటీసిచ్చి వెళ్లిపోమంటోంది. దోహా వేదికగా నవంబరు 20 నుంచి ఫుట్‌బాల్ సమరం మొదలుకానుంది. మ్యాచ్‌లను చూసేందుకు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే లక్షల మంది అభిమానులకు సరిపడా నివాసాలు లేకపోవడంతో ఖతర్ యంత్రాంగం విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకుంది. వీరిలో అధికులు ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖతర్ జనాభా 30 లక్షలు కాగా, 85 శాతం విదేశీ కార్మికులే. వీరిలో అధికులు డ్రైవర్లు, దినసరి కార్మికులు ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.