NRI: రియాధ్‌లో తెలుగు ప్రవాసీల దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-27T18:50:25+05:30 IST

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ఇటీవల ప్రవాసాంధ్రులు రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో దీపావళి సంబురాలను ఉత్సాహాభరితంగా జరుపుకొన్నారు.

 NRI: రియాధ్‌లో తెలుగు ప్రవాసీల దీపావళి వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాధ్(Riyadh) నగరంలో ఇటీవల ప్రవాసాంధ్రులు(NRIs) రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో దీపావళి సంబురాలను(Diwali Celebrations) ఉత్సాహాభరితంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తాము రియాధ్ నగరంలో ఉమ్మడి కుటుంబంగా దీపావళిని జరుపుకొంటున్నట్లుగా ప్రధాన నిర్వహకుడు తిరుపతి స్వామి స్వర్ణ అలియాస్ స్వామి తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలను మురారి, బిందు, శ్రీదేవి, రమ్య, అక్షితలు పర్యవేక్షించడమే కాకుండా ప్రదర్శనకారులకు శిక్షణ కూడా ఇచ్చారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను మధు, ప్రసాద్, నటరాజ్, మహేంద్ర, భాస్కర్‌లు పర్యవేక్షించారు. కార్యక్రమ నిర్వహణలో నటరాజ్, భరణి, అనిల్ మర్రి, వినయ్, సుఖేశ్, నాగేంద్ర, విజయ్, శేషు, శ్రవణ్, విశ్వలు సహకరించారని స్వామి తెలిపారు.

1.jpg

రియాధ్ నగరంలోని తోటి తెలుగు ప్రవాసీయులందరూ కలిసి సహకరించడంతో దీపావళి వైభవంగా జరిగిందని తిరుపతి స్వామి చెప్పారు. రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో తాము గత నాలుగు సంవత్సరాలుగా దీపావళి, సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. తెలుగు పెద్దలు ఆంటొనీ సూచనలు, తోడ్పాటుతో తాము తెలుగు వారికి సేవలందిస్తున్నట్లు స్వామి వెల్లడించారు. హెల్పింగ్ హ్యాండ్స్ రియాధ్ పేరిట తాము ఆపదలో ఉన్న ప్రవాసీయుల కోసం సహాయక చర్యలు కూడా చేపట్టినట్లుగా స్వామి తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్‌ను తాము 2020లో నెలకొల్పినట్లుగా ఆయన వెల్లడించారు.

2.jpg

కోవిడ్ సంక్షోభ సమయంలో తెలుగు ప్రవాసీయులతో పాటు బంగ్లాదేశీయులు, నేపాలీయుల మొత్తం 150 మందికి తాము ఆహార సామాగ్రిని అందించినట్లు తెలిపారు. కొన్ని సందర్భాలలో మృతదేహాలను స్వదేశానికి పంపించడంలో సహకరించామని, అదే విధంగా ఆపదలో ఉండి టిక్కెట్ కొనలేని కొందరికి టిక్కెట్లు కూడా సమకూర్చినట్లు స్వామి వెల్లడించారు. భాస్కర్ బొమ్మి (కడప), వెంకట్ (హైద్రాబాద్), శరత్‌ కలిసి 2020లో హెల్పింగ్ హ్యాండ్ రియాధ్‌ను(Helping hands Riyadh) ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని పెర్కోన్నారు. ఇతర సంఘాల తరహాలో అందరి నుండి కాకుండా తమ సభ్యులైన కొంత మంది కలిసి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకొంటున్నట్లుగా స్వామి చెప్పారు. తమ సంఘంలో ఎవరు కూడా అధినాయకులు లేరని, అందరు సమాన భాగస్వాములని, అందరి సమిష్ఠి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని ఆయన నొక్కి చెప్పారు.

3.jpg

Updated Date - 2022-10-27T19:44:40+05:30 IST