Dubai: ముంబై వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల నడకలో తేడా.. అనుమానంతో తనిఖీ చేసిన అధికారులకు నోటమాట రాలేదు!
ABN , First Publish Date - 2022-10-30T07:19:28+05:30 IST
దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ మహిళా ప్రయాణికులను ముంబై ఎయిర్‌పోర్ట్ (Mumbai Airport) కస్టమ్స్ బుధవారం అదుపులోకి తీసుకుంది.
ముంబై: దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ మహిళా ప్రయాణికులను ముంబై ఎయిర్‌పోర్ట్ (Mumbai Airport) కస్టమ్స్ బుధవారం అదుపులోకి తీసుకుంది. వారిద్దరు 2.65 కిలోల బంగారంను (Gold) మైనంగా మార్చి కాళ్లకు చుట్టుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన గోల్డ్ విలువ సుమారు రూ. 1.39కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే.. బుధవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఓ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన ఇద్దరు మహిళ ప్రయాణికులు కస్టమ్స్ అధికారులకు అనుమానస్పదంగా కనిపించారు. వారి నడకలో మార్పును గమనించిన అధికారులు తనిఖీ చేయాలని ఆపారు. మొదట వారి లగేజీని సోదా చేశారు. కానీ, అందులో ఏమీ దొరకలేదు.
దాంతో మహిళా సిబ్బందితో వారిద్దరిని క్షుణ్ణంగా సోదా చేయాల్సిందిగా ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు మహిళా సిబ్బంది వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి కాళ్లపై ఏదో మైనం పూసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఆ మైనాన్ని తొలిగించి చూసిన అధికారులు షాకయ్యారు. ఆ మైనమంతా పసిడి అని తెలియడంతో అధికారులకు నోటమాట రాలేదు. ఆ ఇద్దరి కాళ్లకు ఉన్న మైనాన్ని తొలగించి తుకం వేయడంతో 2.65 కేజీలుగా తేలింది. దాని విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 1.39కోట్లు అని అధికారులు తేల్చారు. అనంతరం ఆ ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.