Vijayashanthi: టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం.. సర్కారీ బడులపై బకాయిల భారం
ABN , First Publish Date - 2022-11-10T22:18:55+05:30 IST
తెలంగాణ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. విద్యారంగ ప్రమాణాలు చూస్తుంటే ఒకవైపు విద్యార్థులు, మరోవైపు టీచింగ్ స్టాఫ్... ఇద్దరినీ తెలంగాణ సర్కారు (Telangana Govt) దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్న దుస్థితి కనిపిస్తోందని విజయశాంతి ఆరోపించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''మన పెద్దలు చదువు విలువను తెలియజేస్తూ "విద్యలేనివాడు వింత పశువు" అనే నానుడిని తరచుగా ప్రస్తావించేవారు. పోరాడి సాధించుకున్న మన తెలంగాణలో దురదృష్టవశాత్తూ విద్యారంగం దారుణంగా పతనమైపోయింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల నిరసనలు ఒక కొలిక్కి వచ్చాయనుకునే లోపే... ఇటీవలి రోజుల్లో విద్యారంగ ప్రమాణాలు చూస్తుంటే ఒకవైపు విద్యార్థులు, మరోవైపు టీచింగ్ స్టాఫ్... ఇద్దరినీ తెలంగాణ సర్కారు దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే... ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 180కి పైగా సర్కారీ బడులు రూ.15 లక్షల మేర విద్యుత్ బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ చిన్న మొత్తానికి కూడా సర్కారు బడ్జెట్ విడుదల చెయ్యలేదు. మరోవైపు హైదరాబాదులోనే నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ వివాదం... హాస్టల్ కావాలంటూ నిజాం కాలేజీ డిగ్రీ స్టూడెంట్స్ రోడ్డుకెక్కారు. ఇంకోవైపు.... హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ మొత్తంగా ఇంఛార్జిల మయంగా మారిపోయింది. సర్కారీ, ఎయిడెడ్, ప్రయివేట్ స్కూళ్ళను పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డీఈఓలు, డీఐఓఎస్‌ల కొరతతో ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నయి. ఇదిలా ఉంటే 4 నెలలుగా జీతాలు లేక గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో అటు విద్యార్థులు, ఇటు బోధకులు ఎవరూ సంతృప్తిగా లేని తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.'' అని విజయశాంతి అన్నారు.