మా నాన్న చంపేశాడు.. నేనేం చేశానంటే..
ABN , First Publish Date - 2022-10-27T15:34:46+05:30 IST
ఒకరిద్దరు కాదు ఏకంగా 70 మందిని చంపామనీ..
మీరు వంశీ దర్శకత్వంలో వచ్చిన అన్వేషణ అనే సినిమాను చూశారా..? ఆ సినిమాలో ఓ సీన్‌లో పాడుబడిన ఓ బావిలోంచి శవాలు గుట్టలు గుట్టలుగా బయటపడతాయి. ఎన్నో ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వారి మృతదేహాలు బయటపడతాయి.. అచ్చం అదే సీన్‌ను పోలిన ఓ సంఘటన అమెరికాలో తాజాగా బయటపడింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 70 మందిని చంపామనీ.. తామే గుట్టుచప్పుడు కాకుండా బావిలోనూ, ఇతర ప్రదేశాల్లోనూ పూడ్చేసి శవాలను మాయం చేశామని ఓ మహిళ చెప్పడంతో అగ్రరాజ్యంలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆమె చెప్పింది నిజమేనా..? నిజమే అయితే ఎందుకు చేశారు..? 30 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నా ఎందుకు ఎవరికీ అనుమానం రాలేదు..? అంటూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మొత్తం అగ్రరాజ్యాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని అయోవాలో డొనాల్డ్ డీన్ అనే వ్యక్తి తన 30 ఏళ్ళ కాలంలో 70మందిని చంపాడు. ఆ శవాలను స్వయంగా అతని కూతురు, మిగిలిన అతని పిల్లలు ప్రజల కంట పడకుండా మాయం చేశారు. ఈ విషయాన్ని నేరుగా అతని కూతురు లూసీ బయటపెట్టడం విశేషం. అంతేకాదు ఆ మృతదేహలలో కొన్నింటిని తాము 100 అడుగుల లోతైన బావిలో పాతిపెట్టామని, మరికొన్నింటిని కొండప్రాంతంలోకి విసిరేసామని ఆమె చెప్పింది. సుమారు అయిదు ఎకరాల విస్తీర్ణం కలిగిన అటవీ భూమిలో ఇదంతా చేశామని ఆమె పోలీసుల ఎదుట వెల్లడించింది. డొనాల్డ్ డీన్ మహిళలను చంపిన తరువాత వారి నోట్లో ఉన్న బంగారు పన్నును బయటకు తీసి తనవద్ద ఉంచుకునేవాడు, మృతి చెందిన వారి దుస్తులు, వారి ఒంటి మీద ఆభరణాలు అలాగే ఉంచేవాడు అని లూసీ పోలీసుకు తెలిపింది.
లూసీ ఆమె సహచరులు శవాలను మోసుకెళ్ళేందుకు ఎవ్వరికీ అనుమానం రాని పద్దతులు పాటించారు. ఈ విషయాలన్నీ లూసీ గుర్తులతో సహా చెప్పడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో వేట మొదలుపెట్టారు. అచ్చం ఆమె చెప్పినట్టుగానే బావిలో కుళ్లిపోయిన పరిస్థితిలో మృతదేహాలు కుప్పగా, భరించలేని దుర్గంధం వెదజల్లుతూ దొరికాయి. మరికొన్ని చోట్ల పాతిపెట్టిన మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిలో చాలా వరకు వేశ్యలు, డోనాల్డ్ నివాసప్రాంతానికి దగ్గర్లో నివశించినవారే అనే విషయాన్ని కూడా లూసీ వెల్లడించింది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు గనుక నిజమని నిరూపణ అయితే అమెరికా చరిత్రలో అతిపెద్ద హంతకుడుగా డొనాల్డ్ డీన్ గుర్తించబడతాడు.