Anand Mahindra: ఇది క్రూరత్వం..నా జీవితమంతా.. ఆనంద్ మహీంద్రా ఆవేదన.. వైరల్ ట్వీట్..

ABN , First Publish Date - 2022-12-22T21:11:58+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో మహిళలను యూనివర్సిటీ చదువులకు దూరం చేస్తూ తాలిబన్లు విధించిన నిషేధం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Anand Mahindra: ఇది క్రూరత్వం..నా  జీవితమంతా.. ఆనంద్ మహీంద్రా ఆవేదన.. వైరల్ ట్వీట్..

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్‌లో(Afghanistan) మహిళలను యూనివర్సిటీ చదువులకు దూరం చేస్తూ తాలిబన్లు విధించిన నిషేధం(Ban) ప్రస్తుతం సంచలనంగా మారింది. తాలిబన్ల పాలనలో(Taliban Rule) మహిళల అణచివేత చూసి యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) కూడా స్పందించారు. సమాజసేవ అంటే.. మహిళల అక్షరాస్యత పెంపొందించేందుకు కోసం పాటుపడటమే.. నా జీవితమంతా ఇదే నమ్ముతూ వచ్చా. కానీ.. ఇవాళ ఆప్ఘాన్ మహిళలు యూనివర్సిటీల్లో చదవకుండా తాలిబన్లు నిషేధం విధించారన్న వార్తతో నన్ను ఎంతగానో కలిచివేసింది. యుద్ధం, హింసతో మానవహననానికి పాల్పడటం, రక్తం ఏరులై పారించడం భయంగొలిపే హత్యలే . అయితే.. ఈ నిషేధం కూడా ఓ హత్యే.. సుదీర్ఘకాలం పాటూ సాగే క్రూరమైన మారణకాండ..’’ అంటూ ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఇకపై యూనివర్సిటీల్లో చదువుకోకూడదంటూ తాలిబన్లు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గతేడాది అప్ఘాన్ పగ్గాలు చేజిక్కించుకున్న తాలిబన్లు..ఛాందసవాద పాలనకు దూరంగా ఉంటామంటూ మొదట్లో ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత.. క్రమంగా తమ పాత విధాలను అమలు చేయడం మొదలుపెట్టారు. షరియా చట్టం పేరిట మహిళల అణచివేతకు తెరలేపారు. బాలికలను మాధ్యమిక, ఉన్నత పాఠశాల చదువులకు దూరం చేశారు. అనేక రంగాల్లో మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఆంక్షలు విధించారు. పార్క్‌, జిమ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదన్న నిబంధన విధించారు. అంతేకాకుండా.. తల నుంచి కాలి వేళ్లవరకూ శరీరమంతా కప్పి ఉంచేలా మహిళల వస్త్రధారణ ఉండాలని తేల్చి చెప్పారు.

Updated Date - 2023-01-16T22:51:20+05:30 IST