చిన్నారి మోముపై శాశ్వతమైన చిరునవ్వు.. ఎంత కష్టమొచ్చిందమ్మా నీకు..!

ABN , First Publish Date - 2022-06-01T02:05:13+05:30 IST

మొదటిసారి ఆ చిన్నారిని చూసిన వారెవరైనా నవ్వుతోందేమో అని పొరబడతారు. కానీ.. ఒక్కనిమిషం తెరిపారా చూస్తే మాత్రం మనసంతా విషాదంతో నిండిపోతుంది. కారణం..అది చిరునవ్వు కాదు..

చిన్నారి మోముపై శాశ్వతమైన చిరునవ్వు.. ఎంత కష్టమొచ్చిందమ్మా నీకు..!

మొదటిసారి ఆ చిన్నారిని చూసిన వారెవరైనా నవ్వుతోందేమో అని పొరబడతారు. కానీ.. ఒక్కనిమిషం తెరిపారా చూస్తే మాత్రం మనసంతా విషాదంతో నిండిపోతుంది. కారణం..అది చిరునవ్వు కాదు.. ముఖాకృతిలో లోపం.. నోటికి రెండువైపులా ఏర్పడ్డ ఓ చీలిక! నిపుణులు దాన్ని శాశ్వతమైన చిరునవ్వుగా కూడా అభివర్ణిస్తుంటారు.  ఆస్ట్రేలియాకు చెందిన అయిలా సమ్మర్ మూచా అనే చిన్నారి ఈ అరుదైన సమస్య బారిన పడింది. గతేడాది డిసెంబర్‌లో ఆమె జన్మించింది. అయితే.. తమ బిడ్డకు వచ్చిన సమస్య గురించి ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రజల్లో ఈ సమస్యపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 


ఏమిటీ సమస్య

వైద్య పరిభాషలో దీన్ని బైలేటరల్ మాక్రోస్టోమియా అంటారు. పిండం అభివృద్ధి చెందే క్రమంలో దవడలోని కణజాలం క్రమపద్ధతిలో అభివృద్ధి చెందకపోవడంతో ఈ సమస్య వస్తుంది. ఫలితంగా.. నోటి చివర ఉన్న కణాలు పూర్తిస్థాయిలో అనుసంధానం కాక  చీలిక ఏర్పడుతుంది. దీనికి కారణమేంటనే దానిపై శాస్త్రవేత్తల్లోనూ స్పష్టత లేదు. జన్యుపరమైన, పర్యావరణ కారణాలు కలగలిసి ఈ సమస్య తలెత్తుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే.. మగ శిశువుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.ప్రతి 3 లక్షల మంది చిన్నారుల్లో ఒకరు ఈ సమస్య బారిన పడతారు.  


ట్రీట్‌మెంట్ ఇదే..  

బుగ్గల్లోని కణజాలాన్ని శస్త్రచికిత్స ద్వారా పునర్నిర్మించడం లేదా దానంతట అదే అభివృద్ధి చెందేలా చేయడం ద్వారా సమస్య తీవ్రత  కొంత మేర తగ్గించవచ్చు. ఈ రెండు విధానాల కలయికతో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్నారులు స్కూళ్లల్లో చేరకమునుపే పరిష్కార మార్గాలు అవలంబించాలని సూచిస్తున్నారు. లేకపోతే.. వారు ఎదిగే క్రమంలో మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-06-01T02:05:13+05:30 IST