ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే..
ABN , First Publish Date - 2022-04-04T22:56:34+05:30 IST
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కాలు కదపకుండానే ఎన్నో పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు ఇదే టెక్నాలజీ కారణంగా కొంతమంది యువత.. చేజేతులా తమ జీవితాలను నాశనం..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కాలు కదపకుండానే ఎన్నో పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు ఇదే టెక్నాలజీ కారణంగా కొంతమంది యువత.. చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన చిన్నపిల్లలు కూడా.. నిత్యం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే గడుపుతున్నారు. కొందరు పిల్లలు వివిధ గేమ్‌లు ఆడుతూ.. ఆ పిచ్చి నుంచి బయటికి రాలేకున్నారు. ఇలా చాలా మంది విద్యార్థులు.. చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే 12ఏళ్ల పిల్లాడు.. ఒక్క ఫోన్‌తో రైల్లోని ప్రయాణికులను హడలెత్తించాడు. చివరకు రైల్వే అధికారులు.. ‘‘ఎందుకిలా చేశావు’’.. అని పిల్లాడిని నిలదీయగా, అసలు విషయం తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
బెంగళూరులోని యళహంక రైల్వే స్టేషన్‌లో మార్చి 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యళహంక, కాచిగూడ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. కాసేపుంటే రైలు బయలుదేరుతుందనగా.. రైల్వే అధికారులకు ఓ ఫోన్ వచ్చింది. ‘‘స్టేషన్‌లో బాంబు పెట్టాం.. అది ఏ క్షణంలోనైనా పేలొచ్చు’’ అని చెప్పి కాల్ కట్ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బయలుదేరాల్సిన రైళ్లను నిలిపేశారు. ప్రయాణికులను స్టేషన్‌లోకి అనుమతించకుండా.. బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి, స్టేషన్ మొత్తం తనిఖీ చేయించారు. దాదాపు మూడు గంటల పాటు ఎవరినీ అనుమతించలేదు. అయితే చివరికి ఎక్కడా బాంబ్ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారికి వచ్చిన ఫోన్‌కు ట్రై చేయగా.. స్విచ్చాఫ్ అని వచ్చింది. విచారించగా, ఇదంతా యళహంక పరిధిలో ఉంటున్న 12ఏళ్ల బాలుడు చేసినట్లుగా తెలిసింది.
వధూవరులిద్దరికీ జ్యూస్ తాగించి.. ఎంత పని చేశారు.. తీరా చూస్తే..
బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు చెప్పింది విని అంతా అవాక్కయ్యారు. ఫోన్ చేసిన బాలుడు, అతడి స్నేహితుడు కలిసి మార్చి 30న మధ్యాహ్నం ఫోన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నారు. అయితే అదే సమయంలో బాలుడి స్నేహితుడు.. కాచిగూడ రైల్లో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. రైలు ఎక్కితే సిగ్నల్స్ సరిగా రాని కారణంగా గేమ్ మధ్యలోనే ఆగిపోతుందని ఆందోళన చెందారు. ‘‘నా స్నేహితుడి ప్రయాణం ఆగకూడదు, అలాగే మా గేమ్ మధ్యలోనే ఆగకూడదనే ఉద్దేశంతో బెదిరింపు కాల్ చేశాను’’ అని బాలుడు చెప్పడంతో అధికారులంతా అవాక్కయ్యారు. అయితే మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. మొత్తానికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.