UK: డెలివరీ బాయ్ నుంచి ఊహించని మెసేజ్.. కస్టమర్‌కు భారీ షాక్..!
ABN , First Publish Date - 2022-10-30T18:51:22+05:30 IST
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టి డెలివరీ కోసం ఎదురుచూస్తున్న ఓ కస్టమర్‌కు డెలివరీ బాయ్ ఇచ్చిన రిప్లైతో దిమ్మతిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టి.. డెలివరీ కోసం ఎదురుచూస్తున్న ఓ కస్టమర్‌కు డెలివరీ బాయ్(Delivery boy) ఇచ్చిన రిప్లైతో దిమ్మతిరిగింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో.. డోన్ట్ కేర్ అని అతడు ఇచ్చిన రిప్లై చూసి ఆ కస్టమర్ నోరెళ్లబెట్టాడు. బ్రిటన్‌లో(Britain) జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. లియామ్ అనే ఓ వ్యక్తి ఇటీవల డెలివరీ యాప్‌లో తనకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు. మంచి ఆకలిమీద ఉండటంతో అతడు ఫుడ్ డెలివరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. చాలా సేపు వేచి చూసినా ఆహారం డెలివరీ కాకపోవడంతో డెలివరీ బాయ్‌కి మెసేజ్ చేశాడు. అతడి రిప్లై చూసి లియామ్‌కు దిమ్మతిరిగినంత పనైంది.
మొదట లియమ్‌కు సారీ చెబుతూ డెలివరీ ఏజెంట్ ఓ మెసెజ్ పెట్టాడు. ఏం జరిగిందని లియమ్ ప్రశ్నించాడు. దీంతో.. అతడు అసలు విషయం మొత్తం బయటపెట్టేశాడు. ఆహారం రుచిగా ఉండటంతో మొత్తం తానే తినేశానంటూ భయం లేకుండా చెప్పేశాడు. అంతేకాకుండా.. కావాలంటే కస్టమర్‌కేర్‌లో కంప్లైంట్ ఇచ్చుకో అంటూ రెచ్చిపోయాడు. దీంతో.. లియమ్‌కు దిమ్మతిరిగినంతపనైంది. ఇలా నిస్సిగ్గుగా నిబంధనలు అతడు ఎలా ఉల్లంఘించగలిగాడో లియమ్‌కు అర్థం కాలేదు. దీంతో.. లియమ్ అతడిపై ఇంతెత్తున లేచాడు. నీలాంటి దారుణమైన మనిషిని ఎక్కడా చూడలేదని మెసేజ్ పెట్టాడు. కానీ.. డెలివరీ బాయ్ మాత్రం యథాప్రకారం.. నేను ఇలాంటివి లెక్కచేయను.. అంటూ మరో మెసేజ్‌తో సంభాషణ ముగించేశాడు.
తమ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ ఆధారంగా లియమ్ డెలివరూ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో.. డెలివరూ లియమ్‌కు క్షమాపణలు చెప్పింది. తమ సిబ్బంది కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా.. లియమ్, డెలివరీ బాయ్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ డెలివరీ ఏజెంట్ తీరును చూసి పలువురు షాకైపోయారు. తమకూ గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని మరి కొందరు చెప్పుకొచ్చారు.