న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..
ABN , First Publish Date - 2022-06-25T02:46:16+05:30 IST
ఆ బాలిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన ఘటన కారణంగా రెండు చేతులూ పోగొట్టుకుంది. ప్రస్తుతం కాళ్ల సాయంతోనే అన్ని పనులూ చేసుకుంటోంది. అయితే ఇటీవల ఆమెకు జరిగిన అన్యాయంపై..
ఆ బాలిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన ఘటన కారణంగా రెండు చేతులూ పోగొట్టుకుంది. ప్రస్తుతం కాళ్ల సాయంతోనే అన్ని పనులూ చేసుకుంటోంది. అయితే ఇటీవల ఆమెకు జరిగిన అన్యాయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. కాళ్ల సాయంతో లేఖ రాసింది. ఆమె దీనగాధ విన్న న్యాయమూర్తి.. నేరుగా వారి ఇంటికే వచ్చి విచారించారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా హపోన్‌కిధాని ప్రాంతానికి చెందిన లీలా రాజ్‌పుత్ అనే బాలిక ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. ఈమె ఎనిమిదేళ్ల వయసులో ఉండగా.. విద్యుదాఘాతానికి గురై రెండు చేతులూ పోగొట్టుకుంది. దీంతో ప్రభుత్వం బాలికకు రూ.5 లక్షల సాయం ప్రకటించింది. కొన్నేళ్ల అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ఆ సాయం అందింది. అయితే బాలిక భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఆమె తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని బార్మర్‌లోని నవజీవన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేశారు. ఇదిలావుండగా, తర్వాత సోసైటీ వారు ఆ డబ్బును ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ నగదు కోసం బాలిక కుటుంబ సభ్యులు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
తల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!
ఈ క్రమంలో మే 24న లీలా.. తమ సమస్యను తెలియజేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాళ్ల సాయంతో లేఖ రాసింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఈ విషయాన్ని.. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకెళ్లింది. మొత్తం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వికాస్ సింగ్ చౌదరి.. గురువారం లీలా ఇంటికి చేరుకుని విచారించారు. అలాగే పోలీసులను కూడా పిలిపించి మాట్లాడారు. విచారణ అనంతరం డబ్బులు ఇప్పించనున్నట్లు న్యాయమూర్తి హామీ ఇచ్చారు. న్యాయమూర్తి నేరుగా మా ఇంటికి రావడం సంతోషంగా ఉందని, త్వరలో మాకు రావాల్సిన మొత్తం అందుతుందనే నమ్మకం ఉందని బాలిక తెలియజేసింది.