B.Com Idli Wala Viral Video: బీకామ్ చదివి మరీ ఓ బైక్‌పై ఈ కుర్రాడు ఇడ్లీలు అమ్ముకోవాల్సి రావడం వెనుక..!
ABN , First Publish Date - 2022-10-14T21:40:47+05:30 IST
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడి, బాగా సంపాదిస్తూ కూడా ఉన్నఫలంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసేవాళ్లను చూశాం. అలాగే సొంత వ్యాపారం ఏర్పాటు..
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడి, బాగా సంపాదిస్తూ కూడా ఉన్నఫలంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేసేవాళ్లను చూశాం. అలాగే సొంత వ్యాపారం ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలను సంపాదించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు కుటుంబ బాధ్యతల కారణంగా తక్కువ జీతానికి కూడా ఉద్యోగం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఆ ఉద్యోగం కూడా లేకుండా పోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు కుటంబ బాధ్యతల కారణంగా ఏదో ఒక పని చేయడానికి సిద్ధపడుతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువకుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బీకామ్ (B.Com student) చదివి కూడా బైక్‌పై ఇడ్లీలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఇతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే..
హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్‌కు చెందిన అవినాష్ కుమార్ శుక్లా 2019లో ఢిల్లీ యూనివర్శిటీలో (University of Delhi) బీకామ్ పూర్తి చేశాడు. అనంతరం రిలయన్స్ ట్రెండ్స్, మెక్‌డొనాల్డ్స్, అమెజాన్ (Reliance Trends, McDonald's, Amazon) తదితర కంపెనీల్లో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలో 2021లో అవినాష్ తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలు అవినాష్ మీద పడ్డాయి. ఇలావుండగా, మూడు నెలల క్రితం అనుకోకుండా అతడు ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా అతన్ని చుట్టు ముట్టాయి. దీంతో పాటూ భార్య, కొడుకు.. మరోవైపు తల్లి, తన ఇద్దరు తమ్ముళ్లు కూడా ఇతనిపైనే ఆధారపడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం ఏ పని చేయాలో అతడికి అర్థం కాలేదు. అవినాష్ ఇంటర్ పాస్ అయిన సందర్భంగా అతడి తండ్రి బైక్ కొనిచ్చాడు. ఆ బైక్ ద్వారానే ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు.
Govt Jobs: అదృష్టం అంటే ఇదే కదా.. ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంకో విశేషం ఏంటో తెలుసా..
వాహనాలపై చేసే వ్యాపారాల గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. చివరకు తన బైకుపై ఇడ్లీ వ్యాపారం చేయాలని భావించాడు. తన భార్య చెన్నైకి చెందినది కావడంతో.. ఇడ్లీ, సాంబారు చేయడంలో మంచి అనుభవం ఉండేది. ఇదే విషయాన్ని భార్యకు చెప్పడంతో ఆమె కూడా అంగీకరించింది. ఇంకేముందీ.. బైకు వెనుక పెద్ద బకెట్, పెద్ద గొడుగు ఏర్పాటు చేసుకున్నాడు. ఇడ్లీ, సాంబారు, వడను ఇంటి వద్ద సిద్ధం చేసుకుని, ఫరీదాబాద్ ప్రధాన రహదారి వద్ద వ్యాపారం మెదలెట్టాడు. ప్లేటు ఇడ్లీ, సాంబారును రూ.20కి అందిస్తున్నాడు. ఇడ్లీ రుచికరంగా ఉండడంతో జనం ఎగబడుతున్నారు. ఇతడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. దీంతో అవినాష్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.