బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా.. వరుడి ఎంట్రీ చూసి తిడుతున్న నెటిజనం!
ABN , First Publish Date - 2022-11-19T09:15:58+05:30 IST
ఈ మధ్య యువతి, యువకులు పెళ్లి వేడుకకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు చేసి మరీ.. వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొంటూ ఆ మధుర క్షణాలను మరింత మధురంగా మార్చుకుంటున్నారు. ఓ యువకుడు కూడా..
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య యువతి, యువకులు పెళ్లి వేడుకకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు చేసి మరీ.. వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొంటూ ఆ మధుర క్షణాలను మరింత మధురంగా మార్చుకుంటున్నారు. ఓ యువకుడు కూడా అచ్చం ఇలానే ఆలోచించాడు. ఈ క్రమంలోనే అందరికంటే భిన్నంగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. చివరికి నెటిజన్లతో చివాట్లు తింటున్నాడు. అసలు ఇంతకూ ఏం జరిగిందంటే..
వివాహ మండపం వద్దకు వరుడు గ్రాండ్గా ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. కొన్ని ప్రాంతాల్లో వరుడు గుర్రంపై ఊరేగుతూ వస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో పెళ్లి మండపం వద్దకు చేరుకుంటాడు. కానీ ఓ వరుడు మాత్రం.. వెరైటీగా శవపేటికలో పడుకుని మరీ వివాహ మండపానికి చేరుకున్నాడు. శవపేటికలో వరుడు పడుకుని ఉండగా.. అతడి స్నేహితులు దాన్ని వివాహ వేదిక వద్దకు మోసుకొచ్చారు. అనంతరం వరుడు తాపీగా శవపేటిక నుంచి బయటకు వచ్చి, ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియనప్పటికీ.. అందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ.. సదరు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శుభమా అని పెళ్లి చేసుకుంటూ.. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఇలా చేస్తారా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.