యుకేలో చదువుకుని.. ఇండియాలో అవకాడో సాగుచేస్తూ, లాభాలు ఆర్జిస్తున్న యువకుడు!
ABN , First Publish Date - 2022-11-13T11:59:36+05:30 IST
అవకాడో అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫలం. ప్రీమియం క్వాలిటీ అవకాడో పంటను దేశంలో కొన్ని ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. దేశంలో అవకాడో ఫార్మింగ్‌ను అభివృద్ధి చేసేందుకు 25 ఏళ్ల హర్షిత్ గోథా విశేష కృషి చేస్తున్నారు.

అవకాడో అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫలం. ప్రీమియం క్వాలిటీ అవకాడో పంటను దేశంలో కొన్ని ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. దేశంలో అవకాడో ఫార్మింగ్‌ను అభివృద్ధి చేసేందుకు 25 ఏళ్ల హర్షిత్ గోథా విశేష కృషి చేస్తున్నారు. హర్షిత్ యూకేలో బీబీఏ చదువుకున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగివచ్చి అవకాడో పంట సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. హర్షిత్‌కు ఫిట్‌నెస్ అంటే ఎంతో ఇష్టం. యూకేలో ఉండే సమయంలో హర్షిత్ రొటీన్ డైట్‌లో అవకాడో ముఖ్యభాగం. అయితే ఇండియాలో హర్షిత్‌కు మంచి క్వాలిటీ కలిగిన అవకాడో లభ్యం కాలేదు. దీనిని గుర్తించి, ఈ లోటును భర్తీ చేసేందుకు హర్షిత్ అవకాడో నర్సరీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హర్షిత్ మాట్లాడుతూ ఒకరోజు తాను యూకేలో అవకాడో తింటున్నప్పుడు దాని ప్యాకెట్ వైపు దృష్టి మళ్లింది. ఆ అవకాడో ఇజ్రాయెల్ నుంచి వచ్చిందని దానిపై రాసివుంది. ఇజ్రాయెల్ లాంటి వేడి దేశాలలో అవకాడో పండిస్తున్నప్పుడు భారత్‌లో ఎందుకు పండించకూడదనుకున్నాను. అది మొదలు తన పరిశోధన మొదలయ్యిందన్నారు. ఇజ్రాయెల్ లోని పలువురికి మెయిల్ చేసి అవకాడో పంటకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నానన్నారు. ఒక రైతు తాను అవకాడో పంటకు శిక్షణ అందిస్తానని, ఇది ఒక నెలపాటు ఉంటుందని, ఇజ్రాయెల్ రమ్మని ఆహ్వనించాడన్నారు. భారత్ తిరిగివచ్చిన హర్షిత్ అవకాడో సాగు చేసేందుకు రెండేళ్లు వేచివుండాల్సి వచ్చింది. దేశంలో మంచి క్వాలిటి కలిగిన అవకాడో విత్తనాలు దొరకకపోవడమే దీనికి కారణం.
దీంతో ఇజ్రాయెల్ నుంచి అవకాడో మొక్కలు తెప్పిద్దామని హర్షిత్ భావించాడు. అయితే ఇందుకు ఎంతో పేపర్ వర్క్ చేయాల్సివచ్చింది. ఈ వర్క్ పూర్తయ్యాక కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకసారి కరోనా కష్టాలు వెంటాడగా, మరోమారు లాక్‌డౌన్ ఇబ్బందులు ఎదురయ్యాయని హర్షిత్ తెలిపారు. తన తాత భోపాల్‌లో ప్రముఖ న్యాయవాది అని, తండ్రి కూడా లాయర్ వృత్తిలో ఉన్నారని, అయితే తాను ఈ విధంగా అవకాడో సాగు మొదలు పెడతానని తెలిసి చాలామంది అవహేళన చేశారన్నారు. అయితే తన కుటుంబం తనకు సహకరించడంతో విజయవంతంగా అవకాడో పంటను సాగుచేస్తున్నానని తెలిపారు. హర్షిత్ ఈ ఏడాదిలోనే తన అవకాడో సాగును ప్రారంభించారు. అయితే కొద్దినెలలకే ఊహించనంత లాభాలను అందుకున్నారు. ఇప్పుడు హర్షిత్ అవకాడో పండ్లను విక్రయించడంతోపాటు అవకాడో మొక్కలను కూడా విక్రయిస్తున్నారు.