Hindu Widow Remarriage Act 1856 : వయసుకు రాకముందే వివాహం.. వైధవ్యం..!
ABN , First Publish Date - 2022-12-07T10:55:45+05:30 IST
వితంతువుల పట్ల అప్పటి సమాజం కఠినంగా వ్యవహరించేది.
పసి వయసులోనే పెళ్ళి పీటలెక్కి, ముక్కుపచ్చలారని వయసులోనే వితంతువుగా మిగలడం అనేది అప్పటి రోజుల్లో ఒక్క భారతదేశంలోనే ఎక్కువగా జరిగేది. ఈ మూఢాచారాన్ని చాలా మంది వ్యతిరేకించారు. స్త్రీ పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగిన తరువాత జరగవలసిన వివాహం ఆమె ఆడుకునే వయసులోనే జరిగేది. తల్లిదండ్రులు కన్యాశుల్కం ఆశతో వృద్ధులతో వివాహం జరిపించేవారు. లోకం తెలియని పసివయసులో మరొకరికి ఇల్లాలుగా వెళ్ళేది. పెద్ద వయసైన భర్త చనిపోతే అప్పట్లో సతీ సహగమనం వంటి దురాచారం కూడా ఉండేది. వితంతువుల పట్ల అప్పటి సమాజం కఠినంగా వ్యవహరించేది. భర్త చనిపోయిన స్త్రీ అందంగా కనిపించకూడదని, రంగురంగు దుస్తులు ధరించకూడదని, పదిమందిలో తిరకూడదనే మూఢాచారం విపరీతంగా ఉండేది. అందుకే ఆమెకు అందమైన కేశాలను తొలగించి గుండు చేయించేవారు, తెల్లని చీర కట్టించేవారు, పదిమందిలోకీ రాకుండా చీకటి గదులలో మగ్గిపోయేలా చేసేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల వల్ల వితంతువులు వివక్షను ఎదుర్కొనే వారు. కట్టుబాట్లకు లోబడి జీవితాన్ని గడిపేవారు. ఈ దురాచారాన్ని కొందరు హిందూ సంప్రదాయవాదులు వ్యతిరేకించారు.
ఇందులో ముఖ్యంగా బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీసహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం కృషి చేశాడు. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు వితంతు పునర్వి వివాహాల్ని ప్రోత్సహించారు. వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమేనని కందుకూరి నిరూపించాడు. మొదటి వితంతు వివాహాన్ని కందుకూరి తన స్వగృహంలో 1881, డిసెంబరు 11 వ తేదీన బాలవితంతువు గౌరమ్మ, గోగులమూడి శ్రీరాములకి జరిపించాడు.
అప్పటి పరిస్థితులు..
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, వితంతువులు ఒక సాధువులా జీవితాన్ని గడపవలసి వచ్చేది. వారిని మామూలు మనుషుల్లా బతకనివ్వలేదు. వారిపైన కాఠిన్యం, అలంకరణ లేకుండా, కొత్త దుస్తులు ధరించకుండా, మంచి ఆహారం తీసుకోకుండా ఆంక్షలు ఉండేవి, పండుగల నుండి బహిష్కరించేవారు. కుటుంబం, సమాజంలోని సభ్యులందరికీ దూరంగా బ్రతకవలసి వచ్చేది. మిగతావారితో ఆరళ్ళు పడవలసి వచ్చేది. తిట్టడం, వెట్టి చాకిరీ చేయించడం వంటి ఇబ్బందుల మధ్య తీవ్రమైన జీవితాన్ని గడపాలని వచ్చేది. వితంతువుని కుటుంబం మొత్తానికి దురదృష్టవంతురాలిగా పరిగణించి దూరంగా ఉంచేవారు.
భారతదేశంలో స్త్రీలను నరకానికి ద్వారం అని భావించే కాలం అది. ప్రతి అంశంలోనూ స్త్రీలు అణచివేతకు గురయ్యేది. దేశంలో వితంతు పునర్వివివాహాల సంస్కృతికి నాంది పలికి ప్రోత్సహించిన వారిలో మొదటగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒకరు. 1856 భారత దేశంలో వితంతు పునర్వివాహ చట్టం అమలుకు ముందు 1829లో లార్డ్ విలియం బెంటింక్ సతీ సహగమన ఆచారాన్ని రద్దు చేశారు. ఇక హిందూ వితంతు పునర్వివాహ చట్టం ముసాయిదాను లార్డ్ డల్హౌసీ తయారు చేసి ఆమోదించారు. వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది 1852 జూలై 16న. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చింది మాత్రం 1856 జూలై 26 వ తేదీన.
ఈ చట్టం వితంతువులను వివాహం చేసుకున్న పురుషులకు చట్టపరమైన రక్షణను కూడా కల్పించేది. హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం, 1856 ప్రకారం, వితంతువు తన మరిణించిన భర్త నుంచి పొందిన ఏదైనా వారసత్వాన్ని కోల్పోయే అధికారం కలిగి ఉంటుంది. మరణించిన భర్తతో వితంతు స్త్రీకి ఉన్న పిల్లల సంరక్షకత్వాన్ని తీసుకునే విధంగా పునర్వివాహం చేసుకున్న తరువాత చనిపోయిన భర్త తండ్రి లేదా తల్లి లేదా అమ్మమ్మ కోర్టులో పిటిషన్ వేయవచ్చు. హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం 1856 అమలులోకి వచ్చిన తరువాత మొదటి వివాహం 1856 డిసెంబర్ 7వ తేదిన ఉత్తర కలకత్తాలో జరిగింది. వరుడు ఈశ్వర్ చంద్ర సన్నిహితుడి కుమారుడు కావడం విశేషం. కాబట్టి హిందూ వితంతు పునర్వివాహ చట్టం అములు కావడం అనేది భారత దేశ చరిత్రలో 19వ శతాబ్దానికే ప్రధాన సామాజిక మార్పుగా చెప్పవచ్చు. అప్పటి నుండి ఎందరో స్త్రీల సమగ్రత, నిరాడంబరతను కాపాడటానికి ఇటువంటి చట్టాలు రూపొందించబడ్డాయి.