నీతో అస్సలు రానంటూ భర్తకు తేల్చిచెప్పిన భార్య.. కాసేపటికే పరుగెత్తుకు వచ్చి పిల్లలు చెప్పింది విని..
ABN , First Publish Date - 2022-04-26T13:55:02+05:30 IST
కలహాలు లేని కాపురం చప్పగా ఉంటుందంటారు పెద్దలు. కానీ కొన్ని కుటుంబాల్లోని దంపతులు మాత్రం నిత్యం కలహాలతో కాపురం చేస్తుంటారు. దంపతుల మధ్య తలెత్తే...
కలహాలు లేని కాపురం చప్పగా ఉంటుందంటారు పెద్దలు. కానీ కొన్ని కుటుంబాల్లోని దంపతులు మాత్రం నిత్యం కలహాలతో కాపురం చేస్తుంటారు. దంపతుల మధ్య తలెత్తే సమస్యలు చివరికి చాలా దూరం వెళ్తుంటాయి. కొన్నిసార్లు చిన్న సమస్యలే.. హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. మధ్యప్రదేశ్‌లో దంపతుల మధ్య విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నీతో అస్సలు రానంటూ భార్య తేల్చి చెప్పింది. అయితే కాసేపటికి పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పిన మాట విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లాలోని ఓర్చా రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవంత్‌పురా గ్రామానికి చెందిన రమేష్ అహిర్వార్, పూనమ్ దంపతులు. వీరికి 15ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి సూర్య ప్రకాష్ (14), అంకిత్ (10), భూపేంద్ర (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట్లో సవ్యంగా సాగిన వీరి సంసారం.. ఇటీవల సమస్యలకు నిలయంగా మారింది. రమేష్ మద్యానికి బానిసవడంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. దీంతో విరక్తి చెందిన ఆమె.. శుక్రవారం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకొచ్చేందుకు మరుసటి రోజు రమేష్ కూడా వెళ్లాడు. అయితే అతనితో వచ్చేందుకు పూనమ్ అంగీకరించలేదు. తాగుడు మానేస్తేనే వస్తా.. లేదంటే రానంటూ తెగేసి చెప్పింది.
పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్.. తరచూ ప్రిన్సిపాల్ గదిలో సమావేశం.. గ్రామస్తులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా..
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్.. ఊరి బయట ఉన్న 60అడుగుల లోతైన బావిలోకి దూకాడు. గమనించిన రమేష్ పిల్లలు.. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లికి విషయం తెలియజేశారు. దీంతో పూనమ్‌తో పాటూ స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు. రమేష్‌ను సురక్షితంగా బయటికి తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త అంటే తనకు చాలా ఇష్టమని, అయితే తాగుడుకు బానిసవడంతో అలా అన్నానని పూనమ్ తెలిపింది. తనలో మార్పు రావాలనే పుట్టింటికి వచ్చానని, అంతేగానీ భర్తను దూరం చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పింది. ఎట్టకేలకు రమేష్‌కు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.