IFFI 2022: ‘జీవన తరంగాలు’ హిందీ సినిమానా.. హవ్వా.. తెలుగు సినిమాకు మరోసారి అవమానం..
ABN , First Publish Date - 2022-11-19T20:35:49+05:30 IST
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. ‘బాహుబలి’, ‘RRR’ లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. ‘కరోనా’ లాంటి కష్ట కాలం తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి..
తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. ‘బాహుబలి’, ‘RRR’ లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాయి. ‘కరోనా’ లాంటి కష్ట కాలం తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలను హిట్ చేశారు. టాలీవుడ్ స్థాయి వేరు. తెలుగు సినిమా ప్రస్తావన వస్తే మనవాళ్లు ఇప్పటికీ చెప్పుకునే గొప్పలివి. గొప్పగా సినిమాలు తీయడం, ఆ సినిమాలకు ప్రేక్షకులు ఎగబడి రావడం వరకూ సరే. కానీ.. మన సినిమాలకు గుర్తింపు దక్కే విషయంలో మాత్రం ఇప్పటికీ తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అన్యాయం జరుగుతూనే ఉంది.
తాజాగా.. 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం సందర్భంగా Homages విభాగంలో ఎంపిక చేసిన ‘జీవన తరంగాలు’ సినిమాకు జరిగిన అవమానమే ఇందుకు ఉదాహరణ. దక్షిణాది చిత్రాలకు మరీ ముఖ్యంగా తెలుగు చిత్రాలకు మరోసారి అవమానం జరిగిందనడానికి ఈ ఉదంతమే తార్కాణం. తెలుగు నిర్మాత, తెలుగు నటులు, తెలుగు దర్శకుడు తెరకెక్కించిన ‘జీవన తరంగాలు’ సినిమాను హిందీ చిత్రంగా పేర్కొనడం కచ్చితంగా తెలుగు సినిమాకు జరిగిన అవమానమేనని చెప్పక తప్పదు. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ‘జీవన తరంగాలు’ సినిమా అప్పట్లో తెలుగులో పెద్ద హిట్. ఈ సినిమాలోని ‘ఈ జీవన తరంగాలలో.. ఆ దేవుని చదరంగంలో’ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాంటి సినిమాను IFFI 2022 Indian Cinema Catalog లో హిందీ సినిమాగా చెప్పుకొచ్చారంటే తెలుగు సినిమాకు ఏమేర గుర్తింపు దక్కుతుందో చెప్పకనే చెప్పొచ్చు.
తాతినేని రామారావు దర్శకత్వం వహించిన సినిమాలు ‘జీవన తరంగాలు’ సినిమాతో పాటు చాలానే ఉన్నాయి. ‘మరపురాని మనిషి’, ‘ఆలుమగలు’, ‘అనురాగ దేవత’, ‘భార్యాబిడ్డలు’ వంటి చెప్పుకోతగ్గ చిత్రాలు తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చినవే. కృష్ణం రాజు నటించిన ‘భక్త కన్నప్ప’, ‘త్రిశూలం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి సినిమాలు ఆయన నటనా కౌశలానికి అద్దం పడతాయి. ఇలా తాతినేని రామారావు, కృష్ణం రాజు వేరువేరు సినిమాలు చెప్పుకోతగ్గవి చాలానే ఉన్నా IFFI మాత్రం ఇద్దరికీ కలిపి ఒక సినిమాను.. అది కూడా కృష్ణంరాజు కన్న ప్రేమను మరిచి కన్నతల్లి పాడెను కాని వాడిగా మోసే నెగిటివ్ పాత్ర పోషించిన ‘జీవన తరంగాలు’ సినిమాను ఎంపిక చేయడం తెలుగు సినిమాకు జరిగిన అన్యాయంగానే చూడక తప్పదు. ‘జీవన తరంగాలు’ సినిమాను ఎంపిక చేయడం తప్పు కాదు. అలాంటి గొప్ప సినిమాకు గౌరవం దక్కాల్సిందే. కానీ.. ఆ సినిమాను హిందీ సినిమాగా పేర్కొనడం, తాతినేని, కృష్ణం రాజు.. ఇద్దరికీ కలిపి ఈ సినిమా చాల్లే అనే చులకన భావనతో ‘జీవన తరంగాలు’ సినిమాను గుర్తించడం ముమ్మాటికీ తెలుగు సినిమాకు జరిగిన అవమానమే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ‘జీవన తరంగాలు’ సినిమాలో హీరో కృష్ణం రాజు కాదు శోభన్ బాబు. చెడు వ్యసనాలకు బానిసైన పాత్రను కృష్ణం రాజు పోషించారు. ఆయన నటనను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మరే సినిమా దొరకనట్టుగా ఇలాంటి పాత్ర కలిగిన సినిమాను ప్రస్తావించడం రెబల్ స్టార్‌ను అవమానించడం కాక మరేమిటని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమాలకు, తెలుగు నటులకు గుర్తింపు దక్కకపోవడంపై గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తెలుగు సినీ జనం గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్ర వీణ’ 1988లో విడుదలై అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ‘నర్గీస్‌దత్’ అవార్డు దక్కింది. ఆ అవార్డును తీసుకునేందుకు చిరంజీవితో పాటు చిత్ర బృందం ముంబై వెళ్లింది. ఆ సందర్భంలో భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతికి సంబంధించి అక్కడి ఒక గోడ మీద వేసిన ఆర్ట్‌లో దక్షిణాది నుంచి అతి తక్కువ మంది నటులకే గుర్తింపు దక్కింది. తెలుగు జాతి గర్వించదగ్గ నటులైన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారికి కూడా ఆ ప్రదర్శనలో స్థానం లభించకపోవడం బాధించిందని.. ఆ పరిణామాన్ని తాను తెలుగు సినిమాకు జరిగిన అవమానంగా భావించానని మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.
భారతీయ సినిమా అంటే ‘బాలీవుడ్’ సినిమా అనే భావన పోయి దక్షిణాది సినిమాలు, తెలుగు సినిమాలు కూడా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాగమేననే విషయాన్ని గుర్తించే రోజులు రావాలని తెలుగు సినీ జనం ఆకాంక్షిస్తున్నారు. ఇక.. కొంతలో కొంత హర్షించదగిన విషయం ఏంటంటే.. ఇండియన్ పనోరమా విభాగంలో ‘సినిమా బండి’ అనే తెలుగు సినిమాను ఎంపిక చేశారు. ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మన తెలుగు సినిమా ‘మేజర్’ హిందీ వెర్షన్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్‌ను ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఎంపిక చేయడం హర్షించదగిన విషయం. ‘అఖండ’ సినిమా కూడా 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవానికి ఎంపికైంది. నవంబర్ 20 నుంచి 28వరకూ 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు గోవా వేదికగా జరగనున్నాయి.