RELATIONSHIP: బంధాలు బలహీనమవుతున్నాయా.. ఇదిగో ఇలా పదిలం..

ABN , First Publish Date - 2022-12-20T12:18:40+05:30 IST

బంధంలోకి వెళ్ళడం సులువే కానీ..

RELATIONSHIP: బంధాలు బలహీనమవుతున్నాయా.. ఇదిగో ఇలా పదిలం..

ఏమండీ కొంచెం ఇది రావట్లేదు చూస్తారా అని అడుగుతుందొక భార్య.. నేను పనిలో ఉన్నాగా ఇది వదులుకుని రావాలా అని చిరాకు పడతాడు సదరు భర్త. ఏమోయ్ ఏం చేస్తున్నావు నేను తొందరగా వచ్చేస్తున్నాను, కాస్త వేడిగా ఏమైనా చేసి ఉంచు ఆకలి దంచేస్తోంది. అని అడుగుతాడు సదరు భర్త, మీరు ముందే చెప్పాలిగా తొందరగా వస్తానని, నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను మీరు వేడిగా బయటే ఏమైనా తినేయండి అని బదులిస్తుంది సదరు భార్య.

చేస్తున్నపని అయిదు నిమిషాలు పక్కన పెట్టి వెళ్ళి సహాయం చేస్తే ఆ భార్య సంతోషం, బయట ఎక్కడున్నా భర్తకంటే తొందరగా ఇల్లు చేరి భర్తకోసం ఏదైనా ప్రేమగా వండిపెడితే ఆ భర్త సంతోషం గురించి మాటల్లో చెప్పలేం. కానీ... భార్యాభర్తలు ఒకరికి మరొకరు సహకరించుకోకుండా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుంటున్నారు. ఇవి కేవలం ఉదాహరణకు మాత్రమే ప్రస్థావించిన విషయాలు అయినా రోజులో ఇద్దరి మధ్య ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా బంధాల మధ్య బీటలు వారి అన్యోన్యత తగ్గిపోతోంది. ఒక బంధంలోకి వెళ్ళడం సులువే కానీ బంధాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టం అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సిలర్లు. కానీ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితులలో అయినా బంధాలు పదిలంగా ఉంటాయి.

చిన్న చిన్న విషయాలకు మనస్పర్థలు రావడం, ఒకరిమీద మరొకరు కోపం చేసుకోవడం జరిగినపుడు సమస్యను సరిదిద్దుకునే దిశగా అడుగులు వేయాలి తప్ప మనుషుల మధ్య ఇగోలతో వాటిని విచ్చిన్నం చేసుకునే దిశగా వెళ్ళకూడదు. ఆరోగ్యం బాగాలేనపుడు శరీరం కుదుట పడాలంటే మందులు ఎంత అవసరమో బంధాలు దృఢంగా, ధీర్ఘకాలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంటుంది.

స్పేస్..

జీవిత భాగస్వాములు అయినా తమకూ కాస్త వ్యక్తిగత స్వేచ్చ కావాలని అంటున్నారు ఈ తరం వారు. అయితే స్పేస్ అనే కారణంతో ఇద్దరి మధ్య దూరం మరీ ఎక్కువైతే కష్టం. ఏదైనా మాట్లాడాలాన్నా, చర్చించాలన్నా ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒకరికి ఒకరమనే భావన దృఢంగా ఉంటుందప్పుడు.

నిజాయితీ..

నిజాయితీ లేకపోతే కేవలం ఇద్దరి మధ్య వైవాహిక బంధాలే కాదు స్నేహాలు, ఇతర పరిచయాలు ఏవీ కూడా ఎక్కువ కాలం నిలబడవు. అందుకే నిజాయితీ అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగినా.. ఆర్థిక విషయాలు కానీ ఎవరినైనా కలవడంలో కానీ ఇలా ప్రతి విషయాన్ని కూడా దాపరికం లేకుండా బయటకు చెప్పేయాలి. ఇలా చెప్పడం వల్ల ఎదుటి వారు అబద్దం చెప్పడం లేదనే నమ్మకం ఏర్పడుతుంది.

అతిగా కల్పించుకోకపోవడం..

విషయం ఏదైనా, వివాహబంధంలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు చెప్పి తీరాలి అనే మనస్తత్వాన్ని రానీయకూడదు. ఒకరిని మరొకరు గౌరవించుకునేలా ప్రవర్తన ఉండాలి. అతిగా జోక్యం చేసుకుంటే బంధాలకు సంకెళ్ళు వేసిన భావన కలుగుతుంది.

భావోద్వేగాలు..

బంధం అంటేనే భావోద్వేగాలతో కలసిపోయి ఉంటుంది. ఎమోషన్స్ లేని మనిషి, అసలు ఎమోషన్స్ లేని ఏ సందర్భాలు ఉండనే ఉండవు. భాగస్వాములు భావోద్వేగాలకు లోనయినప్పుు వారికి కాసింత ఓదార్పు, ఊరట అవసరం అవుతుంది. కాబట్టి భావోద్వేగాలు ఉన్నప్పుడు ఒకరి తోడ్పాటు మరొకరికి అవసరం అవుతుందనే విషయాన్ని మరచిపోకూడదు.

ప్రేమను అర్థం చేసుకోవాలి..

ప్రేమ అనేది విభిన్నరకాలుగా ఉంటుంది. ప్రేమలో కేవలం ఇష్టం మాత్రమే ఉండదు. కోపం, అలక, చిరాకు, ఎదుటివారికి ఏదైనా అనడంలో కూడా భాద్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. అయితే ఆ ప్రేమను అపార్థం చేసుకునేవారు కొందరైతే.. పెళ్ళైన చాలామందిలో కేవలం అవసరమైనవి సమకూర్చి పెడితే సరిపోతుంది అనే మనస్తత్వం తప్పు. చూసే కోణాన్ని బట్టి విషయం అర్థమవుతుందంటారు కాబట్టి పాజిటివ్ గా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుంటే బంధాలు పదిలంగా ఉంటాయి.

Updated Date - 2022-12-20T12:18:42+05:30 IST