RIP Kaikala Satyanarayana: నింగికెగసిన నవరస నటనా సార్వభౌమ!

ABN , First Publish Date - 2022-12-23T11:10:16+05:30 IST

తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. అన్ని రసాల్లోనూ తిరుగులేని నటనను ప్రదర్శించిన అరుదైన నటుడు ఆయన. తాత, తండ్రి, మేనమామ, బాబాయ్‌, కొడుకు.. ఇలా సత్యనారాయణ చేయని పాత్ర లేదు.

RIP Kaikala Satyanarayana: నింగికెగసిన నవరస నటనా సార్వభౌమ!

తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన విశిష్ట నటుల్లో కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana) ఒకరు. అన్ని రసాల్లోనూ తిరుగులేని నటనను ప్రదర్శించిన అరుదైన నటుడు ఆయన. తాత, తండ్రి, మేనమామ, బాబాయ్‌, కొడుకు.. ఇలా సత్యనారాయణ (Kaikala satyanarayana is no more) చేయని పాత్ర లేదు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు... ఇలా ఆరోజుల్లో హీరోలు ఎంతమంది ఉన్నా విలన్‌ కైకాల ఒక్కరే! చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల తనదైన నటనతో మెప్పించి నవరస నటనా సార్వభౌముడి గుర్తింపు పొందిన కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహంలో కన్ను మూశారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్‌ దిగ్ర్భాంతికి లోనైంది. (RIP Kaikala satyanarayana)

కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. 1951 వరకూ అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగారు. హై స్కూల్‌ చదువు గుడ్లవల్లేరులో, కళాశాల విద్య గుడివాడ కాలేజ్‌లో జరిగింది. 1955లో బి.ఎ. డిగ్రీ పొందారు. ఆయనకు చిన్నతనం నుంచి నాటకాలంటే చెప్పలేనంత అభిమానం. అందుకే ఒక పక్క కాలేజీలో చదువుకుంటూనే కౌతరం గ్రామంలోని తన స్నేహితులతో కలిసి తొలిసారిగా ‘ప్రేమలీల’ నాటకాన్ని 1950లో ప్రదర్శించారు. ఈ నాటకంలో మగవాళ్లే ఆడ వేషాలు వేయడం విశేషం. ఇందులో ఆయనది విలన్‌ వేషం కావడం గమనార్హం. ఇందులో తన నటనకు ప్రశంసలు రావడంతో ప్రభాకర నాట్యమండలి పేరుతో సొంతంగా నాటక సంస్థను నెలకొల్పి ‘కులంలేని పిల్ల’, ‘పల్లెపడుచు’, ‘ఎన్‌.జి.ఓ గుమస్తా’, ఎవరు దొంగ’ తదితర నాటకాలు ప్రదర్శించారు. డిగ్రీ పూర్తి కాగానే రాజమండ్రిలో కొంత కాలం కలప వ్యాపారం చేశారు.

ntr---kaikala.jpg

హీరో టు విలన్‌...

సినిమాల్లో నటించాలనే కోరికతో 1956లో మద్రాసు వెళ్లారు సత్యనారాయణ. వేషాల వేటలో 18 నెలలు గడిచిపోయాయి. ‘బాగున్నావు.. నీకు మంచి భవిష్యత్‌ ఉంది’ అనేవారే తప్ప ఒక్క వేషం ఇచ్చినవారు లేరు. విసిగి వేసారిన సమయంలో నిర్మాత డి.ఎల్‌.నారాయణ ఏకంగా సత్యనారాయణకు ‘సిపాయికూతురు’ చిత్రంలో హీరో వేషం ఇచ్చి, భుజం తట్టారు. జమున ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. రెండో చిత్రం ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’(1960). ఆ తర్వాత హీరో వేషాలు ఎవరూ ఇవ్వకపోవడంతో దర్శకుడు విఠలాచార్య సలహాపై ‘శ్రీ కనకదుర్గ పూజా మహిమ’ (1960)లో తొలి సారిగా విలన్‌ పాత్ర పోషించారు సత్యనారాయణ. ఆ చిత్రంలో మెయిన్‌ విలన్‌గా రాజనాల నటించారు. ఇక అక్కడినుంచి సినిమాల మీద సినిమాలు... దాదాపు అన్నీ విలన్‌ వేషాలే. తెలుగు సినిమాకు కొత్త విలన్‌ దొరికాడు. ‘జై విఠలాచార్య’ అంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకొనేవారు సత్యనారాయణ. పాత విలన్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకుపోయారు.

ఎన్టీఆర్‌ డూప్‌గా... ప్రోత్సాహం...

ఆ రోజుల్లో అగ్ర కథానాయకుడైన ఎన్టీఆర్‌ పోలికలు కొన్ని సత్యనారాయణకు ఉండడం బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్‌ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘రాముడు- భీముడు’ సహా మరో ఆరు చిత్రాల్లో ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించారు సత్యనారాయణ. తన సినిమాల్లోనే కాకుండా ఇతర నిర్మాతలకు చెప్పి సత్యనారాయణకు మంచి వేషాలు వచ్చేలా చేశారు ఎన్టీఆర్‌. ఆయన ప్రోత్సాహంతోనే ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు సత్యనారాయణ.

హీరోగా 13 చిత్రాల్లో

‘సిపాయి కూతురు’ చిత్రంలో తొలి సారిగా హీరోగా నటించిన సత్యనారాయణ తన కెరీర్‌ మొత్తం మీద ‘తాత-మనవడు’, ‘సంసారం - సాగరం’, ‘బంగారు మనసులు’, ‘ఈ కాలం దంపతులు’, ‘మావూరి గంగ’, ‘దేవుడే దిగివస్తే’, ‘నా పేరే భగవాన్‌’, ‘జీవితమే ఒక నాటకం’, ‘సూర్యచంద్రులు’, ‘మొరటోడు’, ‘తాయారమ్మ బంగారయ్య’, కన్నవారిల్లు’ చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే ఆరు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. సాటి విలన్లలో మేటి అనిపించుకొనే రికార్డే ఇది.

Kaikala-3.jpg

ప్రతినాయకుడిగానే కాదు.. కన్నీళ్లు పెట్టించారు...

కరడు గట్టిన విలన్‌ పాత్రలే కాదు కంట కన్నీళ్లు తెప్పించే సాత్విక పాత్రలు కూడా అద్భుతంగా పోషించి, ప్రేక్షకుల అభినందనలు అందుకొన్నారు సత్యనారాయణ. జోరుగా విలన్‌ వేషాలు వేస్తున్న రోజుల్లో ‘ఇది కూడా చెయ్యి’ అంటూ ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో సాత్విక పాత్ర వేయించారు ఎన్టీఆర్‌. మొదట ఆ పాత్ర చేయడానికి సత్యనారాయణ సందేహించినా ఎన్టీఆర్‌ భుజం తట్టారు. అలాగే ‘శారద’ చిత్రంలో కూడా సత్యనారాయణ తన నటనతో ఏడ్పించేశారు. ‘రామయ తండ్రి’ వంటి చిత్రాల్లో కూడా సత్యనారాయణ నటన కంటతడిపెట్టిస్తుంది. అలాగే వినోదభరిత పాత్రలు పోషించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకొన్నారు సత్యనారాయణ. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘ముగ్గురు మూర్ఖులు’ ‘ముందడుగు’ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని నవ్వించింది.

-యు. వినాయకరావు

Updated Date - 2022-12-23T12:00:16+05:30 IST