Indian Army పోస్టు వైరల్.. వధూవరులపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనం!
ABN , First Publish Date - 2022-11-20T09:07:03+05:30 IST
ఇండియన్ ఆర్మీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. అది చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. వధూవరులను అభినందిస్తూ..
ఇంటర్నెట్ డెస్క్: వివాహ వేడుకకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శుభకార్యంతోనే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అందుకే ఈ వేడుకను అంగరంగ వైభంగా బంధువులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకోవాలని భావిస్తారు. ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. అయితే.. ఇప్పుడు ఈ టాపిక్ ఎందకొచ్చిందంటే.. ఇండియన్ ఆర్మీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. అది చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. వధూవరులను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన రాహుల్, కార్తిక.. ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. దీంతో వాళ్లకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. పెళ్లి ముహూర్తాన్నీ ఫిక్స్ చేశారు. ఆహ్వాన పత్రికలు ఆప్తులకు అందజేయడం ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ఆ వధూవరులు ఇద్దరూ కలసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ రోజు మేము సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం మీరే. మీ వల్లే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మీరు సరిహద్దుల్లో పహారా కాస్తున్నందునే ఈ ఆనంద క్షణాలు మా జీవితాల్లో ఉన్నాయి. మీకు చాలా రుణపడి ఉన్నాం. ఇప్పుడు సంతోషంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మా వివాహ వేడుకకు మిమ్మల్ని ఆహ్వానించడం మాకు సంతోషంగా ఉంది. పెళ్లికి హాజరై మీ ఆశీర్వదాలు అందజేస్తే మరింత సంతోషిస్తాం’ అని పేర్కొంటూ ఇండియన్ ఆర్మీ(Indian Army)కి శుభలేఖను పంపారు.
వధూవరుల ఆహ్వానం(Wedding Invitation)పై ఇండియన్ ఆర్మీ స్పందించింది. ఆర్మీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆశిస్తూ.. వధూవరులు పంపిన శుభలేఖను అధికారిక ఇన్స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఇండియన్ ఆర్మీని వివాహానికి ఆహ్వానించడం పట్ల వధూవరులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్, కార్తికల పెళ్లి ఈ నెల 10న జరిగింది.