Panchatantram Review: బాగుంది కానీ.. బాగా సాగదీసాడు !

ABN , First Publish Date - 2022-12-09T14:28:28+05:30 IST

ఈమధ్య చాలామంది యువ దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. అలాగే చిన్న సినిమాలు కూడా విరివిగా విడుదల అవుతున్నాయి, ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 9 న చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 'పంచతంత్రం' (Panchatantram film) ఒకటి, దీనికి యువకుడు అయినా హర్ష పులిపాక (Harsha Pulipaka is the director) దర్శకుడు.

Panchatantram Review: బాగుంది కానీ.. బాగా సాగదీసాడు !

సినిమా: పంచతంత్రం (Panchatantram Review)

నటీనటులు:

బ్ర‌హ్మానందం(Brahmanandam), స‌ముద్రఖ‌ని(Samudrakhani), స్వాతి(Swathi),  దివ్య శ్రీపాద(Divya sripada), దివ్యవాణి, ఉత్తేజ్,  వికాస్ ముప్ప‌ల, రాహుల్ విజ‌య్‌, శివాత్మికా రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, శ్రీవిద్య త‌దిత‌రులు

సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్

ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి

నిర్మాతలు : అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు

రచన, దర్శకత్వం : హర్ష పులిపాక(Harsha pulipaaka)

-సురేష్ కవిరాయని 

ఈమధ్య చాలామంది యువ దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. అలాగే చిన్న సినిమాలు కూడా విరివిగా విడుదల అవుతున్నాయి, ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 9 న చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 'పంచతంత్రం' (Panchatantram film) ఒకటి, దీనికి యువకుడు అయిన హర్ష పులిపాక (Harsha Pulipaka is the director) దర్శకుడు. ఈ సినిమాలో అయిదు కథలు చెప్పానని, అవి మానవునికి వుండే 'పంచేద్రియాలు' ఆధారంగా ఆయా కధలు చెప్పాను అని ఈ సినిమా విడుదలకి ముందు దర్శకుడు చెప్పాడు. అయితే ఇలా కథలుగా ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చాయి, అయితే అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ ఉంటాయి, కానీ ఇందులో మరి ఆలా కనెక్ట్ ఉంటుందా? లేక అన్నీ విడి విడి కథలా? ఎలావుందో చూద్దాం. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం చాల సంత్సరాల విరామం తరువాత ఈ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో కనపడతారు. అలాగే ఈ సినిమాలో చాలామంది తెలుగు అమ్మాయిలు, స్వాతి రెడ్డి, దివ్య శ్రీపాద, శివాత్మిక రాజశేఖర్, శ్రీ విద్య లాంటి వారు కనపడతారు. 

Panchatantram story కథ: 

వేదవ్యాస్ (బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి ఉద్యోగ విరమణ అయి కథలు రాస్తూ ఉంటాడు. అతని కుమార్తె రోషిని (స్వాతి) తండ్రి వుద్యోగం విరమణ చేసాక ఇంట్లో సంతోషంగా ఉండాలని భావిస్తూ ఉంటుంది, అందుకే తండ్రి స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళతానంటే వద్దు నీకెందుకు అని తండ్రిని అంటూ ఉంటుంది. కానీ వేదవ్యాస్ ఇంట్లో కూర్చుని ఏమి చెయ్యాలి అని కూతురు మాటను కాదని పోటీలకు వెళతాడు. మానవునికి వున్న పంచేద్రియాలు థీమ్‌తో ఐదు కథలు చెప్తాడు. 

మొదటి కథ : విహారి (నరేష్ అగస్త్య) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ లో పని చేస్తుంటాడు. పని ఎక్కువ అవటం వాళ్ళ అతను ఎక్కువగా సహనాన్ని కోల్పోతూ ఉంటాడు, అలాగే చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. అలంటి విహారి తన జీవితం లో ఎప్పుడూ సముద్రం చూడలేదు అని స్నేహితులతో అంటాడు. సముద్రం చూసిన వాళ్లందరినీ అది మొదటి సారి చూసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. అలంటి విహారి సముద్రాన్ని చూడాలి అన్న కోరిక పుడుతుంది. ఇంతకీ సముద్రం కి అతనికి వున్న సంబంధం ఏంటి, అతను సముద్రాన్ని చూసాడా? అతని అనుభూతి ఏంటి అనే దృశ్యాన్ని మీ 'కళ్ళు' ద్వారా స్క్రీన్ మీద చూడాల్సిందే. 

రెండో కథ : సుభాష్ (రాహుల్ విజయ్) అనే యువకుడు వుద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకోవాలి అనుకొని, తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసిన ఒక్కటి కూడా అతనికి నచ్చదు. ఎందుకంటే అతనికి కి పెళ్లి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, ఆలోచన వున్నాయి. అందుకే ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక అమ్మాయి కూడా నచ్చదు అతనికి. ఆఖరికి తల్లి బాధ చూడలేక ఈసారి వాళ్ళకి నచ్చితే చాలు అని ఇంకో అమ్మాయి లేఖ (శివాత్మికా రాజశేఖర్) వాళ్ళింటికి వెళతాడు. ముందు సంబంధాలు చూసినప్పుడు అమ్మాయితి విడిగా మాట్లాడే సుభాష్, ఈసారి ఏమి మాట్లాడాను, తల్లిదండ్రులకి నచ్చితే చాలు అంటాడు, ఆ అమ్మాయిని ఖాయం చేసుకుంటాడు.  కానీ అతనికి లేఖ నుండి ఫోన్ వస్తుంది. ఆమె సుభాష్ తో కలిసి మాట్లాడాలి అని ఒక కేక్ బాగా చేసే చోటుకు రమ్మంటుంది. వాళ్లిద్దరూ అక్కడ ఏమి తిన్నారు, ఆలా తింటూ ఏమి చేసారు, ఏమి మాట్లాడారు అన్న విషయం తెలుసుకోవాలంటే మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే.  

మూడో కథ : రామనాథం (సముద్రఖని) స్టేట్ బ్యాంకులో మేనేజర్ గా చేసి విరమణ అయి, అతని భార్య (దివ్యవాణి) తో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాడు. అయితే అతనికి కుమార్తె, అల్లుడు వేరే దగ్గర వుంటారు, కుమార్తె కడుపుతో ఉంటుంది, ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది డెలివరీ కి. ఈలోపు రామనాథం ముక్కుకు ఏదో వాసన వస్తూ ఉంటుంది, అది ఎక్కడ నుండి వస్తోంది అని ఇల్లంతా వెతుకుతాడు. ఒక్కోసారి ఇల్లు ఊడ్చటం, కడగటం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. కానీ విచిత్రంగా అతని భార్యకి ఈ వాసన ఏమి రాదు. రామనాధంకి ఈ వాసనా చాదస్తం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంటే, అతని భార్య అల్లుడుకి, కూతురికి చెపుతుంది. వాళ్లిద్దరూ రామనాథం ని వైద్యుడు దగ్గరికి తీసుకు వెళతారు. ఆ 'వాసన' రామనాధం కి మాత్రమే ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు తగలటం లేదు, అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

నాలుగో కథ : శేఖర్ (వికాస్ ముప్పాల) ఒక చిన్న ఉద్యోగి అతని దేవి (దివ్య శ్రీపాద) ని పెళ్లి చేసుకొని ఒక చిన్న వూర్లో కాపురం చేసుకుంటూ ఉంటాడు. ఆమె కొన్నాళ్ళకు కడుపుతో ఉంటుంది, నెలలు నిందుతున్న సమయానికి ఆమె ఒకరోజు అపస్మారక స్థితిలో మంచం మీద పడి ఉంటుంది. శేఖర్ ఆమెని వైద్యశాలకి తీసుకెళ్లి వైద్యుడికి చూపిస్తే, అతను ఇక్కడ అవదు హైదరాబాద్ తీసుకు వెళ్ళమంటాడు.  అతను హైదరాబాద్ లోని ఒక పెద్ద ఆసుపత్రికి తీసుకు వెళితే అక్కడ డాక్టర్ ఆమెకు క్యాన్సర్ ఉందని చెప్పి, దానికి చాల ఖర్చు కూడా అవుతుందని చెపుతుంది. శేఖర్ తండ్రి అదే సమయం లో వచ్చి సహాయం చెయ్యకుండా, దేవి ని వదిలి వేరే పెళ్లి చేసుకో అని ఒక చాచు సలహా ఇస్తాడు. అలాగే దేవి తల్లి వచ్చి దేవిని కడుపులో వున్న పిల్లని బయటకి తీసేస్తే, దేవి బతుకుతుంది అని ఇంకో చాచు సలహా ఇస్తుంది. ఇలా వాళ్ళిద్దరి తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ ఇలాంటి సలహాలు ఇస్తుంటే, వాళ్లిద్దరూ ఏమి చేసారు? బిడ్డ ఆమె బతికారా, ఏమైంది అనే విషయం తెలుసుకోవాలంటే చూడాల్సిందే. ఇది 'స్పర్శ' కి సంబంచిందిన కథ. 

 

ఐదో కథ : ఇది వినికిడి సంబదించిన కథ. చిత్ర (స్వాతి) అనే అమ్మాయి కుర్చీ కే పరిమితం అయి ఉంటుంది, కానీ ఆమెలో వున్న తృష్ణ ఆమెని ముందుకు తీసుకు వెళుతుంది. అందుకే ఆమె లియో అనే పేరుతో చెప్పే కథలకు చిన్నపిల్లలు చాలామంది అభిమానులు అవుతారు. ఆమె పేరు పిల్లలకి బాగా సుపరిచితం అవుతుంది. ఆలా వున్నవాళ్లలో కోదాడ ప్రాంతానికి చెందిన ఒక డ్రైవర్ సాంబయ్య (ఉత్తేజ్) కూతురు కూడా ఉంటుంది. ఆమె లియో చెప్పే కథలు విని ఊహించుకొని బొమ్మ కూడా వేస్తుంది. కూతురు పుట్టిన రోజు నాడు ఆమెకి తెలియకుండా ఏదైనా చెయ్యాలని, సాంబయ్య హైదరాబాద్ ప్రయాణం అయి లియో ని కలవాలి అనుకుంటాడు. ఇంతకీ అతను హైదరాబాద్ వెళ్లి లియోని కలిసాక ఏమి జరిగింది, పాప గీసిన బొమ్మ ఎటువంటిది, వాళ్ళ జీవితాల్లో ఆ లియో ఎటువంటి మార్పు తీసుకువు వచ్చింది అనేది తెర మీద చూడాల్సిందే. 


విశ్లేషణ:

దర్శకుడు హర్ష పులిపాక చెప్పిన అయిదు కథలు ఇవే. అయితే ఇందులో చివరి రెండు కథలు మాత్రమే బాగుంటాయి, భావోద్వేగాలతో నిండి ఉంటాయి. మొదటి మూడు కథలని దర్శకుడు బాగా సాగదీసాడు అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు అయితే మరీ బోర్ కొట్టే విధంగా వున్నాయి. మొదటి సగం అంత మొదటి రెండు కథలు, ఇంకో కథ సగం వరకు చెప్తాడు. ఈ సంగం మామూలుగా సాగి చూసే ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి కరంగా ఉండదు. కానీ రెండో సగం లో మాత్రం చివరి రెండు కథలు బాగా చెప్పాడు. చెప్పే, చూపించే విధానం కూడా బాగుంది. అయితే దర్శకుడి అభిరుచి బాగుంది. పంచేంద్రియాల గురించి కథలు చెప్పాలన్న ఐడియా బాగుంది. కానీ ఆ చెప్పే విధానం లో మొదటి రెండు కథలు మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. 

ఎందుకంటే మొదటి సగం చాలా  నెమ్మదిగా, నత్త నడకలా సాగుతూ ఉంటుంది. అబ్బా ఎప్పుడు విరామం వస్తుందిరా బాబూ అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతగా సన్నివేశాలని సాగదీసాడు దర్శకుడు. అలాగే మొదటి రెండు కథల్లో కొత్తదనము ఏమి కనిపించదు. చివరి రెండు కథలు దర్శకుడు బాగా రాసుకున్నాడు, తన ప్రతిభ అక్కడ కనపడుతుంది. 

ఇంకా నటీనటుల విషయానికి వస్తే, బ్రహ్మానందం చాలా కాలం తరువాత ఒక మంచి పాత్రలో వేదవ్యాస్ అనే కథకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడు. అలాగే స్వాతి కూడా చాలాకాలం తరువాత కనిపిస్తుంది. కానీ ఆమె మంచి నటి అని ఎప్పుడో నిరూపించుకుంది, ఇందులో కూడా ఆమె కథ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆమె నటన కూడా అంత బాగా చేసింది కాబట్టి. స్వాతి కి ఇది ఒక మంచి సినిమా అవుతుంది. తరువాత దివా శ్రీపాద బాగా చేసింది. ఆమె మంచి టాలెంట్ వున్న నటి, అదీ కాకుండా చాల సహజంగా ఎటువంటి పాత్రలో అయినా ఇమిడిపోతుంది. ఇందులో కూడా ఆమె చాల సహజంగా కనపడుతుంది. చాలా బాగా నటించింది. ఆమెతో పాటు శేఖర్ కూడా బాగా నటించాడు. ఈ రెండు కథలో బాగా చెప్పుకోవాల్సినవి. ఇంకా నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, సముద్రఖని వీళ్ళందరూ వాళ్ళ పాత్రకి సరిపడా చేశారు. 

చివరగా 'పంచతంత్రం' అనేది పంచేంద్రియాలకు సంబందించిన పంచ కథలు. మొదటి మూడు కథలు అంతగా ప్రభావం చూపకపోయినా చివరి రెండు కథలు బాగున్నాయి. ఈ సినిమా చూస్తుంటే ఒక వెబ్ సిరీస్ చూస్తున్నారు అంటే ఒక ఎపిసోడ్ తరువాత ఇంకో ఎపిసోడ్ లా అనిపిస్తుంది. స్వాతి, దివ్య శ్రీపాద లు ఈ సినిమాలో హైలైట్స్. అన్ని వివరంగా చెప్పాము, చూడాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి.

Updated Date - 2022-12-09T14:59:58+05:30 IST