Dr. Sripada Pinakapani : ఆయన గానానికి అమ్మవారే దిగివచ్చారా..!

ABN , First Publish Date - 2022-08-03T18:47:36+05:30 IST

డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతా(Karnataka Music)న్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్(Body Builder).

Dr. Sripada Pinakapani : ఆయన గానానికి అమ్మవారే దిగివచ్చారా..!

‘పద్మభూషణ్’ డాక్లర్ శ్రీపాద పినాకపాణిది తంజావూరు బాణీ


నేడు పినాకపాణి జయంతి


Dr. Sripada Pinakapani : డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతా(Karnataka Music)న్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్(Body Builder). వెయిట్ లిఫ్టర్(Weight Lifter). ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరి చేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన మహనీయులే సంగీత కళానిధి’, ‘పద్మవిభూషణ్’ డాక్టర్ శ్రీపాద పినాకపాణి(Sripada Pinakapani). ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.





ఆరోజు హాజరు కాని వారు దురదృష్టవంతులనే చెప్పాలి..


“జంటనగరాలలో రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్లో, రెండోది హైదరాబాద్లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విధ్వాంసులు దంతాలే ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు కాలేజీలు కలసి రవీంద్రభారతి(Ravindrabharathi)లో త్యాగరాజ స్వామి(Tyagaraya Swamy) ఉత్సవాలు నిర్వహించేవారు. ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ. 


“ఈ ఉత్సవాల్లో ఓ రోజు సంక్రాంతి(Sankranthi Festival) వచ్చింది. ఆవేళ ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం(Koti Srikrishnadevaraya Auditorium)లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం, కర్ణాటక సంగీతంలో నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన ఈ రెండింటిపై.  ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి. నాలుగు గంటలకు పైగా పాణి అద్భుతమైన ప్రసంగం చేసారు. కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట నెరవు, స్వరకల్పన గురించి. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అందరికి. పండగ విందు అక్కడే దొరికింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పినాక పాణి మీద కవర్ పేజి(Cover Page) కథనం ప్రచురించింది. జిఎన్ఎస్ రాఘవన్ రాశారు. ఆయన ఆకాశవాణి వార్తా విభాగానికి డైరెక్టర్‌గా పని చేశారు. రాఘవన్‌కు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం. 



నిండు నూరేళ్ళ పరిపూర్ణ జీవితం..


“మ్యూజిక్ అకాడెమి పినాక పాణిని ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. పినాక పాణికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు భగవదనుగ్రహం కూడా. నూరేళ్ళు పూర్ణాయుర్దాయం లభించింది. నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్నా కావల్సినదేముంటుంది? 1990లో ఆయనకు తొంభై ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాదపూజ చేశారు. ఆయన పాడిన ఓ కచేరి సీడీగా తెచ్చారు. పినాకపాణికి కొన్ని నిర్దిష్టమయిన ప్రమాణాలు వున్నాయని సంగీత ప్రియుడు, రేడియో, దూరదర్సన్‌లలో న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన  ఆర్వీవీ కృష్ణారావు చెప్పారు. వాటితో రాజీపడేవారు కారు అనడానికి ఓ ఉదాహరణ జోడించారు. 


‘బెజవాడలో మా త్యాగరాజ సంగీత కళా సమితి తరఫున ఆయన్ని 1986 లో ఘనంగా సత్కరించాము. అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తితో కలసి కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత సుధారఘునాథన్ కచేరి పెట్టాము. చివరివరకు కూర్చున్నారు. మర్నాడు కూడా వున్నారు. ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి రమ్మనమని పిలిచాం. రానని మొండి కేశారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని నిర్మొహమాటంగా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని కృష్ణారావు తెలిపారు.


ఇక సంగీతానికి వస్తే ‘అసలైన సంగీతం కావేరి నది ఒడ్డున వుంది’ అనేది పినాక పాణి అభిప్రాయం. అందుకనే కాబోలు ‘పాణిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు. చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే, డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి చెబుతూ వుంటారు. సంగీతం ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందాలంటే ఒకే ఒక సూత్రం ఉందంటారు పాణిగారు. ప్రతి వూళ్ళోని  దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వర వాయిద్యం వినిపించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై అభిమానం కలుగుతుందని, అప్పుడే తెలుగునాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనేవారు. 


‘శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి ఒకరికి కూడా లభ్యంకాని ఆ అదృష్టం పినాకపాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించారు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా కొన్నేళ్ళు మనగలిగిన మహద్భాగ్యం.




– భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595

Updated Date - 2022-08-03T18:47:36+05:30 IST