నమ్మడం కొంచెం కష్టమే.. కానీ, నిజంగా ఇది జరిగింది.. చచ్చి మళ్లీ పుట్టిన అక్కాచెల్లెళ్లు!!

ABN , First Publish Date - 2022-11-02T14:27:14+05:30 IST

ఏడాది తిరిగేసరికల్లా అదే ఇంట్లో వారు కవలపిల్లలుగా జన్మించారు

నమ్మడం కొంచెం కష్టమే.. కానీ, నిజంగా ఇది జరిగింది.. చచ్చి మళ్లీ పుట్టిన అక్కాచెల్లెళ్లు!!

అరుంధతి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. తన ఊరికోసం ప్రాణాన్ని త్యాగం చేసే జేజమ్మ మళ్ళీ అదే వంశంలో పుట్టడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మగధీర, తాజాగా రాధే శ్యామ్ సినిమాలు కూడా పునర్జన్మ కోవలోవే.. అయితే ఇలాంటివి నిజంగా జరగడం ఎప్పుడైనా చూశారా?? కనీసం విన్నారా?? కానీ ఇంగ్లాడ్ లో జరిగిన ఈ సంఘటన తెలుసుకుంటే కచ్చితంగా పునర్జన్మల గురించి నమ్ముతారు.

ఆ తండ్రికి పిల్లలంటే చెప్పలేనంత ప్రేమ. తనకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టినా ఏనాడు వారిని తక్కువగా చూడలేదు. ఆ ఇద్దరు పిల్లలతో ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఒక రోజు వారిద్దరూ మరొక అబ్బాయితో కలసి చర్చ్ కు వెళుతుండగా ఒక కారు వేగంగా వచ్చి ఆ ముగ్గరిని గుద్దేసింది. పిల్లలు ముగ్గరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆ పిల్లల మరణం ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధను మిగిల్చింది. అయితే ఏడాది తిరిగేసరికల్లా అదే ఇంట్లో వారు కవలపిల్లలుగా జన్మించారు. తల్లిదండ్రులను ఆశ్చర్యపరచడంతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించిన ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

twi2.jpg

ఇంగ్లండ్ దేశంలో హెక్సామ్ నగరంలో జొవానా, జాక్వెలిన్ అనే అక్కాచెల్లెళ్ళు చర్చికి వెళుతుండగా కారు ప్రమాదంలో మరణించారు. వాళ్ళ నాన్నకు ఆ పిల్లలంటే చెప్పలేనంత ప్రేమ. తన కూతుళ్ళు చనిపోయినా మళ్ళీ తిరిగొస్తారని అందరితో చెబుతూ ఉండేవాడు. కానీ అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతను ఎప్పుడూ తన కూతుళ్ళ కోసం బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగానే అతని భార్య గర్భవతి అయ్యింది. నెలలు నిండిన తరువాత ఆమె కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అందరూ సంతోషంలో ఉంటే వారి తండ్రి మాత్రం ఆశ్చర్యంలో మునిగిపోయాడు. జొవానా, జాక్వెలిన్ చనిపోయినప్పుడు వారి శరీరానికి అయిన గాయాలను పోలిన మచ్చలు కవలపిల్లల శరీరం మీద ఉండటమే అందుకు కారణం. అయితే వాటిని కూడా ఎవరూ పట్టించుకోలేదు.

twi3.jpg

పుట్టిన కవలపిల్లలకు ఇద్దరికీ జిలియన్, జెన్నిఫర్ అని పేరు పెట్టుకుని నెలల వయసు ఉండగానే వారిని తీసుకుని వైట్లీ బే అనే వేరే నగరానికి వెళ్ళిపోయారు. నాలుగు సంవత్సరాల పాటు అక్కడే ఉన్న తరువాత మళ్ళీ హెక్సామ్ కు తిరిగివచ్చారు. అంటే ఆ పిల్లలకు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేవరకు హెక్సామ్ నగరం పరిచయమే లేదు. కానీ వారిద్దరూ హెక్సామ్ వీధులన్నీ తమకు తెలిసినవే అన్నట్టుగా తిరిగేవారు. ఏదైనా కారు ఎదురు వస్తే అది తమను గుద్దేస్తుందని గట్టిగా అరిచేవారు, అది మాత్రమే విచిత్రం అనుకుంటే.. జొవానా, జాక్వెలిన్ ఇద్దరూ ఆడుకునే బొమ్మలకు నిక్ నేమ్స్ పెట్టుకున్నారు. వారి గురించి కానీ ఆ బొమ్మల గురించి కానీ వారి తల్లిదండ్రులు జిలియన్, జెన్నిఫర్ లతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ వారు కప్ బోర్డ్ నుండి బొమ్మలను తీసుకుని వాటిని నిక్ నేమ్స్ తో పిలుస్తూ ఆడుకోవడం అందరినీ మరింత ఆశ్చర్యపరిచింది. హెక్సామ్ నగరంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి వీధిని గురించి తెలిసినట్టు మాట్లాడేవారు కూడా.

jjj.jpg

వీరి గురించి తెలిసిన ఎంతో మంది వీరిని అధ్యయనం చేశారు. ఎన్నో వార్తా పత్రికలు వీరి గురించి ఎన్నో కథనాలు ప్రచురించాయి. ప్రముఖ పరిశోధకుడు ఇయాన్ స్టీవెన్సన్ ఈ అమ్మాయిలపై పరిశోధనలు చేసి ఆ వివరాలను 'Reincarnation and Biology' అనే పుస్తకంలో పొందుపరిచాడు. 1957 మే 5వ తేదీన మరణించి, 1958 అక్టోబర్ 4 వ తేదీన జన్మించిన ఈ కవలలు ప్రస్తుతం 63 సంవత్సరాల వయసుతో జీవించే ఉన్నారు. వీరి వయసు పెరిగే కొద్ది గతజన్మ జ్ఞాపకాలను మరచిపోయారు. అప్పుడప్పుడు కారు వచ్చి గుద్దేస్తున్నట్టు వీరికి కలలు వస్తుంటాయట. ఏది ఏమైనా ఇలాంటి మిస్టరీలకు ఏ శాస్త్రజ్ఞుడు సరైన వివరణ ఇవ్వలేడేమో...

Updated Date - 2022-11-02T14:27:17+05:30 IST