Gangster Shocking Murder: గ్యాంగ్‌స్టర్‌ను పొడిచి చంపేసిన 200 మంది నాగ్‌పూర్ మహిళలు.. ‘నెట్‌ఫ్లిక్స్’లో సంచలనం
ABN , First Publish Date - 2022-11-17T20:12:32+05:30 IST
అది 2004వ సంవత్సరం. ఆగస్టు 13. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ మురికివాడకు చెందిన దాదాపు 200 మంది జిల్లా కోర్టు గదిలో 32 ఏళ్ల గ్యాంగ్‌స్టర్
నాగ్‌పూర్: అది 2004వ సంవత్సరం. ఆగస్టు 13. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ మురికివాడకు చెందిన దాదాపు 200 మంది జిల్లా కోర్టు గదిలో 32 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్‌ను దారుణంగా పొడిచి చంపారు. రాళ్లు, కత్తులు, కారంపొడితో కోర్టుకు వెళ్లిన మహిళలను చూసి కోర్టు సిబ్బంది పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ అక్కు యాదవ్‌ను పట్టుకున్న మహిళలు కత్తితో దాదాపు 70సార్లు కసిదీరా పొడిచి అతడిని హత్య చేశారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. అతడి చెవులు, పురుషాంగాన్ని కోసి పడేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సంచలనం సృష్టించిన ఈ హత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు నేరపూరిత వైరం కారణంగా ఈ హత్య జరిగిందని నిర్థారించారు. అయితే, ఈ ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్ సిరీస్ ఈ హత్యకు సంబంధించి బోల్డన్ని వివరాలను వెలికి తీసింది. గ్యాంగ్‌స్టర్‌ను 200 మంది మహిళలు హత్య చేయడానికి ప్రేరేపించినది ఏమిటన్న విషయాలను స్పృశించింది. నాగ్‌పూర్ మురికివాడలోని మహిళలు కోర్టు గది అంతస్తులో రేపిస్ట్‌ను ఎందుకు హత్య చేశారనే విషయాల గురించి లోతుగా ప్రస్తావించింది.
దొంగతనం నుంచి అత్యాచారాల వరకు
అక్కు యాదవ్ అసలు పేరు భరత్ కాళీచరణ్. 1990ల నుంచి మరణించే వరకు నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ గడిపాడు. అతడొక దొంగ, దోపిడీదారు. హంతకుడు. మరీ ముఖ్యంగా రేపిస్ట్. మహిళలను వారి ఇళ్ల నుంచి బయటకు లాగి వారి దాడి, అత్యాచారం చేసేవాడు. తన సహచరులతో కలిసి ఇళ్లలోకి చొరబడి సామూహిక అత్యాచారాలకు పాల్పడేవాడు. చిన్నారులు, గర్భిణులు.. ఎవరినీ వదిలేవాడు కాదు.
గర్భిణులను కూడా వదల్లేదు
అక్కు యాదవ్ అకృత్యాలకు సంబంధించి సామాజిక కార్యకర్త భాగన్‌బాయి మెష్రామ్.. గర్భవతి అయిన తన స్నేహితుని కుమార్తెపై జరిగిన దాడిని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కు అతడి సహచరులు ఏడు నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేశారని, అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను బాధితురాలి తల్లి తన వద్దకు తీసుకొచ్చి సాయం కోరిందని పేర్కొన్నారు. తాను వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు గుర్తు చేసుకున్నారు. మరెవరికీ ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరానని, కానీ ఆమె భయపడిందని, ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు.
చేతులెత్తేసిన పోలీసులు
ఓ మహిళ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది. దీంతో అక్కు యాదవ్ రెచ్చిపోయాడు. యాసిడ్‌తో ఆమెను బెదిరించాడు. చివరికి మహిళలందరూ ఏకం కావడంతో అక్కు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా కోర్టులో జరిగే విచారణలో అతడికి బెయిలు వస్తుందని ప్రజలకు తెలిసింది. అంతే, కోర్టు వద్దకు చేరుకుని అతడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న మహిళలు, కొందరు పురుషులు కలిసి కోర్టు హాలులోనే అక్కును పొడిచి చంపారు. మహిళల ఆగ్రహావేశాలు చూసి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అక్కును రక్షించలేకపోయారు.
అక్కు యాదవ్‌ను చంపింది మహిళలు కాదా?
ఈ వాస్తవ ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్.. ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఏ కోర్టురూమ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ఎంతో కష్టపడ్డారు. కస్తూర్బానగర్‌లోని ఎంతోమందిని కలిసి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అక్కు యాదవ్ మహిళలను ప్రధానంగా దళితులపై అత్యాచారం చేసి ఆపై చంపేసి ఎలా తప్పించుకునేవాడో ఈ సిరీస్‌లో చూపించారు. ఈ డాక్యుమెంటరీ దర్శకుడు ఉమేశ్ వినాయక్ కులకర్ణి మాట్లాడుతూ.. డాక్యుమెంటరీని తెరకెక్కించడం చాలా సవాలుగా మారిందని అన్నారు.
దర్శకుడు ఉమేష్ వినాయక్ కులకర్ణి మాట్లాడుతూ డాక్యుమెంటరీ తీయడం చాలెంజింగ్‌గా ఉందన్నారు. యాదవ్ క్రిమినల్‌గా మారినప్పటి నుంచి హత్యకు గురికావడం వరకు సీన్లను తెరకెక్కించడం సవాలుగా మారిందన్నారు. అయితే, మహిళల మాటను ప్రత్యర్థి ముఠా యాదవ్‌ను హత్య చేసిందని కూడా చెబుతారని పేర్కొన్నారు. కూరగాయలు తరిగే మహిళల చేతులు యాదవ్‌ను హత్య చేశాయంటే నమ్మబుద్ధి కావడం లేదని కొందరు చెబుతున్నారని ఆయన వివరించారు.
వార్తకు ప్రాధాన్యాన్ని నిర్ణయించేది కులమే
ఈ డాక్యుమెంటరీలో భారతదేశంలోని మురికివాడల వాస్తవికతను వర్ణించినందుకు ప్రశంసలు లభించాయి. అయితే, ఇంత కిరాతకానికి పాల్పడుతున్న అక్కు యాదవ్‌ను అధికారులు శిక్షించకపోవడం వీక్షకులను షాక్‌కు గురిచేసింది. 14 ఆగస్టు 2004లో ఓ రేపిస్టుకు ఉరిశిక్ష విధించి అమలు చేయడంతో మీడియా ఫోకస్ మొత్తం అటువైపు వెళ్లింది. దీంతో నాగ్‌పూర్ ఘటన మరుగున పడినట్టు ఈ సిరీస్ రీసెర్చ్ హెడ్ నిధి సాలియన్ తెలిపారు. ఏ వార్తకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయంలో కులం కూడా కీలక పాత్ర పోషిస్తుందని హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ స్కూల్ ఆఫ్ జెండర్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య తమలపాకుల చెప్పారు. దళిత మహిళలపై అత్యాచారాలను సమాజంలో ఒక సాధారణ విషయంగానే చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే అగ్రవర్ణ మహిళలపై అత్యాచారం జరిగితే మాత్రం దానిని ఓ పెద్ద ఘటనగా చూస్తున్నారని అన్నారు.
ఇప్పటికీ కోలుకోని బాధితులు
యాదవ్ హత్యకు గురై రెండు దశాబ్దాలు గడిచినా బాధితులు ఇప్పటికీ కోలుకోకోపోవడం మరో విషాదం. నాటి ఘటనలను వారు గుర్తు చేసుకునేందుకు ఇప్పటికీ భయపడుతున్నారు. అక్కు యాదవ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది నిందితులను 2014లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు నమ్మదగనివిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, దర్యాప్తులోనూ చాలా లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.