చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..
ABN , First Publish Date - 2022-05-17T19:11:04+05:30 IST
తప్పు చేసిన తర్వాత చాలా మందిలో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. తాము చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగ కూడా ఇలాగే చేశాడు...
తప్పు చేసిన తర్వాత చాలా మందిలో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. తాము చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగ కూడా ఇలాగే చేశాడు. స్థానికంగా ఉంటున్న ప్రముఖ ఆలయంలో కొన్ని విగ్రహాలు చోరీకి గురయ్యాయి. అయితే మళ్లీ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యాయి. వాటితో పాటూ దొరికిన లేఖలో ఓ దొంద రాసింది చదివి... అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్వాలి పరిధిలోని తరౌహాన్ అనే ప్రాంతంలో ఉన్న బాలాజీ ఆలయాలనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో మే 9న చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగులగొట్టి వివిధ లోహాలతో చేసిన విగ్రహాలను ఎత్తుకెళ్లారు. శ్రీరాముడు, రాధాకృష్ణ ఇత్తడి విగ్రహం, బాలాజీ విగ్రహం, లడ్డూ గోపాల్ విగ్రహంతో పాటు నగదు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకుడు మహంత్ రామ్ బాలక్ దాస్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో కొందరు దుండగులు నిత్యం మందు పార్టీలు, జూదాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. వారే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..
ఈ క్రమంలో గత శనివారం మహంత్ రామ్.. తన ఇంటి బయట ఉన్న ఆవులకు మేత వేసేందుకు వెళ్లాడు. అక్కడ అతడికి ఓ లేఖ కనిపించింది. అందులో ’’విగ్రహాలను చోరీ చేసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు... భయంకరమైన కలలు వస్తున్నాయి... అందుకే విగ్రహాలను తిరిగి ఇస్తున్నాను.. దయచేసి వాటిని ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించండి’’..అని రాసి ఉంది. తర్వాత చుట్టు పక్కల పరిశీలించగా.. విగ్రహాలతో కూడిన ఓ బుట్ట కనిపించింది. అయితే అందులో 12 ఇత్తడి, రాగి విగ్రహాలు ఉండగా.. అష్ట లోహాలతో తయారు చేసిన రెండు విగ్రహాలు కనిపించలేదని మహంత్ తెలిపాడు. విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.