మహిళలు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అక్కడ.. ఎన్నెన్నో విచిత్ర సంప్రదాయాలు కూడా.. ఆ గ్రామం ఎక్కడుందంటే..
ABN , First Publish Date - 2022-11-13T09:04:01+05:30 IST
ఒకటా.. రెండా అడుగడుగునా లెక్కకు మించి వింతలు, విడ్డూరాలు అక్కడ..
మహిళలు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకునే వింత సంప్రదాయం ఉందక్కడ. అంతేనా.. అక్కడ హిందూ వివాహ చట్టం, వారసత్వ చట్టం అసలే వర్తించవు. ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మొత్తం విభిన్నంగా ఉంటాయి. మనుషుల నీడ పడితే ఆ ఆహారాన్ని వారు తినరు.. ఇలా ఒకటా.. రెండా అడుగడుగునా లెక్కకు మించి వింతలు, విడ్డూరాలు నింపుకున్న ఆ గ్రామం వేరే ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది. ఇంతకూ ఎక్కడుందా గ్రామం అంటే..
ఇండో టిబెట్ పాత రోడ్డులో సాంగ్లా నుండి 28 కిలోమీటర్ల దూరంలో చిట్కుల్ అనే గ్రామం ఉంది. భారతదేశంలోని చివరి గ్రామం, చివరి పాఠశాల, చివరి పోస్టాఫీసు, చివరి ధాబా అన్నీ ఈ గ్రామంలోనే ఉన్నాయి. 471 మంది ఓటర్ల సంఖ్య కలిగిన ఈ గ్రామంలో ఎన్నో వింత వింత ఆచారాలు ఉన్నాయి. ఎంతో అందమైన ఈ గ్రామానికి వెళ్ళడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి టిబెట్ చైనా సరిహద్దు కేవలం 60కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. 1962లో ఇండో చైనా యుద్దం తరువాత ఈ దారులు మూసివేయబడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీ నుండి ఈ గ్రామం 602 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ గ్రామానికి జర్నీ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే దారి పొడుగునా మంచు కురుస్తుంటుంది. అందుకే అందరూ ప్రమాదంతో కూడుకున్న ప్రయాణంగా దీన్ని అభివర్ణిస్తుంటారు. అంతేనా ప్రయాణ సౌకర్యం విషయంలో కూడా అడ్డంకులు ఉన్నాయి. కేవలం 18 గంటలకు ఒక బస్సు మాత్రమే ఉంటుంది. దాంతో అందమైన ఈ గ్రామానికి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్న పని. కొన్ని సార్లు జారుతున్న రహదారులలో వాహనాలు జారి వందల కిలోమీటర్ల లోతైన లోయలో పడిపోతాయి.
నాలుగు పెళ్ళిళ్ళ సంప్రదాయం ఎలా వచ్చిందంటే..
ఇక్కడ ప్రతి మహిళకు 2 నుండి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకునే స్వేచ్చ ఉంది. మహిళలు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను అయినా పెళ్ళి చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకున్న భర్తలందరితో కలసి ఒకే ఇంట్లో నివాసముంటుంది. ఈ సంప్రదాయం మహాభారత కాలంలో పాండవుల వల్ల వచ్చిందని వారు చెబుతారు. ద్రౌపది పాండవులతో కలసి చిట్కుల్ గ్రామ ప్రాంతానికి వచ్చిందని స్థానికులు నమ్ముతారు. అందుకే స్థానిక ఆడవారు కూడా ఎక్కువ మంది భర్తలు ఉండే సంప్రదాయాన్ని పాటిస్తారు. పెళ్ళిలో ఏడడుగులు వేయడం లాంటి తంతు ఏదీ వీరి సంప్రదాయంలో లేదు. కట్నం తీసుకోవడం మాత్రమే కాదు ఎదురు కట్నం ఇవ్వడం కూడా నిషేదించబడింది ఇక్కడ. ఎక్కువ మంది భర్తలు ఉండటం వల్ల వారికి ఎలాంటి సమస్యా రాదా అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే దాని వల్ల వారికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు భార్య ఒక భర్తతో కలసి గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో అతనికి సంబంధించిన టోపిని గది తలుపుకు తగిలిస్తాడట. దీంతో లోపల భార్య ఎవరితో కలసి ఉందనే విషయం అర్థం కావడమే కాకుండా వారిని డిస్ట్రబ్ చేయకుండా ఉండటానికి వీలవుతుందట. ఇకపోతే తండ్రి ఆస్తిలో కూతురికి ఎలాంటి వాటా ఇవ్వరట. ఒకవేళ తండ్రి చనిపోతే అతనికి కొడుకులు లేకపోయినా ఆ ఆస్తిని తోటి అన్నదమ్ములకు(భార్య పెళ్ళిచేసుకున్న ఇతరులు) వెళుతుందట. ఒకవేళ అలా ఎవరూ లేకపోయిన పక్షంలో మాత్రమే ఆస్తి ఆడపిల్లకు వెళ్తుంది.
వారి దేవతకు ఆహారం నైవేద్యంగా పెట్టినతరువాత మాత్రమే వారు తింటారు. ఆలోపు వండిన ఆహారాన్ని బయటివారు తాకినా, ఆహారం మీద మనిషి నీడ పడినా ఆ ఆహారాన్ని పారేస్తారు. పెళ్ళిళ్ళు జరిగితే ఆడపిల్ల కుటుంబం ఊరు మొత్తానికి భోజనం పెట్టడం అక్కడి నియమం. ఇంకొక వింత ఏమిటంటే.. వీరికి పోలీసులు, కోర్టు లాంటి అవసరం ఇంతవరకు రాలేదట, పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చినా సరిహద్దు ప్రాంతం కావడం వల్ల కేవలం పెట్రోలింగ్ కే వారి పని పరిమితం.
మేకలు గొర్రెల పెంపకం వృత్తిగా కలిగిన ఈ ప్రజలకు పర్యాటక రంగం అభివృద్ది పుణ్యమా అని హోటళ్ళు, గెస్ట్ హౌస్ ల వల్ల కొంత ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడ విపరీతమైన మంచు కురిసే కారణం వల్ల కేవలం ఏప్రిల్, సెప్టెంబర్ లలో మాత్రమే ప్రయాణికుల సందడి ఉంటుంది. ఇక్కడి పాఠశాలల్లో 10వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉన్నా పిల్లలు తక్కువగా ఉండటమే కాక ఉపాద్యాయుల కొరత కూడా ఉంది. ఇక పోస్టాఫీసుకు అయితే ఇప్పుడు ఉత్తరాలు పంపేవారు లేరు కేవలం ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే వస్తుంటాయి. ఇలా ఈ చివరి గ్రామం సరిహద్దు గ్రామమయినా అందరికీ దూరంగా ప్రశాంతంగానే ఉంది.