ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..
ABN , First Publish Date - 2022-04-06T02:56:24+05:30 IST
చిన్న పిల్లల్లో చాలా మంది చదవాలంటేనే బద్ధకిస్తారు. ఏవేవో సాకులు చెప్పి పాఠశాలకు డుమ్మా కొట్టాలనే చూస్తారు. అయితే పెద్దల బలవంతం మీద వెళ్తూ ఉంటారు. కానీ, కొందరు పిల్లలు మాత్రం...
చిన్న పిల్లల్లో చాలా మంది చదవాలంటేనే బద్ధకిస్తారు. ఏవేవో సాకులు చెప్పి పాఠశాలకు డుమ్మా కొట్టాలనే చూస్తారు. అయితే పెద్దల బలవంతం మీద వెళ్తూ ఉంటారు. కానీ, కొందరు పిల్లలు మాత్రం చిన్నతనం నుంచే చాలా చురుకుగా ఉంటారు. చదువులో అందరికంటే ముందుంటూనే ఇంటి పనుల్లోనూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటారు. అయితే 11ఏళ్ల వయసున్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 11ఏళ్ల చిన్నారి సంకల్పం చూసి ఏకంగా మణిపూర్ సీఎం కూడా చలించిపోయారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లాకు చెందిన దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె అయిన మానింగ్‌సిలియు అనే బాలిక నాలుగో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో 11ఏళ్ల మానింగ్‌సిలియు... చెల్లెళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉండేది. మానింగ్సిలియుకు చదువంటే ఎంతో శ్రద్ధ. ఒక్క రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టేది కాదు. పాఠశాలకు వెళ్లే సమయంలో తన రెండేళ్ల చెల్లెలిని ఎత్తుకెళ్లి.. క్లాసులో తన ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ పాఠాలు వినడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఓవైపు చెల్లెలి ఆలనాపాలనా చూస్తూనే.. మరోవైపు చదువును కూడా అశ్రద్ధ చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వార్త మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ దృష్టికి వెళ్లింది.
ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!
చిన్నారి సంకల్పానికి చలించిన సీఎం... ఆదివారం చైల్డ్‌లైన్ సేవా బృందాన్ని వారి గ్రామానికి పంపించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణ ఉపశమనంగా వారికి రేషన్, రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. మరోవైపు మంత్రి బిస్వజిత్ సింగ్ స్పందిస్తూ.. బాలిక డిగ్రీ వరకు చదివేందుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ విద్య పట్ల ఆమెకున్న అంకితభావం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. బాలికను అభినందిస్తూ మంత్రి పేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.