England: పాకిస్థాన్‌ను చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఇంగ్లండ్!
ABN , First Publish Date - 2022-12-06T18:05:28+05:30 IST
పాకిస్థాన్ (Pakistan)తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ (England) చిరస్మరణీయ విజయం
రావల్పిండి: పాకిస్థాన్ (Pakistan)తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ (England) చిరస్మరణీయ విజయం సాధించింది. 74 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసింది. బదులుగా పాకిస్థాన్ కూడా దీటుగా బదులిచ్చింది. 579 పరుగులు చేసి తాము కూడా తక్కువ కాదని నిరూపించింది.
పరుగుల వరద పారుతున్న పిచ్‌పై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 264/7 వద్ద డిక్లేర్ చేసి పాకిస్థాన్‌కు 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఒక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలుపు దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్ల భరతం పట్టారు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన పాక్ 268 పరుగులకే చాప చుట్టేసి ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో కనిపించిన అరుదైన దృశ్యం టెస్టు ప్రేమికులను ఆకట్టుకుంది.
పాక్ బ్యాటర్ల పని పట్టేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) జట్టులోని మొత్తం 11 మందినీ ఒకే దగ్గర మోహరించాడు. బంతిని టచ్ చేయాలంటేనే బ్యాటర్లు భయపడేలా బ్యాటర్ల చుట్టూ ఫీల్డర్లను పెట్టడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఫీల్డర్లందరూ పిచ్ వద్దకు చేరడంతో మైదానం మొత్తం ఖాళీగా కనిపించింది.
ఇటీవలి కాలంలో ఇలాంటి దృశ్యాలు చాలా అరుదు. అప్పుడెప్పుడో కనిపించిన ఇలాంటి దృశ్యం మళ్లీ దర్శనమివ్వడంతో టెస్టు ప్రేమికులు తెగ సంబరపడిపోతున్నారు. టెస్టు క్రికట్‌లోని అసలైన మజా ఇదేనంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.