Bangladesh vs India: బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను ఛిన్నాభిన్నం చేసిన భారత బౌలర్లు!
ABN , First Publish Date - 2022-12-15T17:12:12+05:30 IST
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్
చాటోగ్రామ్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ (Bangladesh) 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ (Team India) కంటే ఇంకా 271 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 404 పరుగుల వద్ద ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే దెబ్బ తగిలింది. సిరాజ్ సంధించిన తొలి బంతిని ఆడడంలో కంగారు పడిన ఓపెనర్ నజ్ముల్ హొసైన్.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అది మొదలు బంగ్లాదేశ్ వికెట్లు టపటపా రాలిపడ్డాయి. సిరాజ్ (Mohammed Siraj), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బంతుల వేడికి తట్టుకోలేని బంగ్లా బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వికెట్లు సమర్పించుకుని చకచకాపెవిలియన్ చేరారు.
యాసిర్ అలీ (4), లిటన్ దాస్ (24), జకీర్ హసన్(20), షకీబల్ హసన్ (3), నురుల్ హసన్ (16), తైజుల్ ఇస్లామ్ (0) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/6 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 404 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) అవుటయ్యాడు. 86 పరుగులు చేసిన అయ్యర్ సెంచరీ చేజార్చుకున్నాడు. అప్పటికి భారత్ స్కోరు 293 పరుగులు. అయితే, అశ్విన్, కుల్దీప్ యాదవ్ క్రీజులో పాతుకుపోయి బంగ్లా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పరుగులు రాబట్టారు. అశ్విన్ 58, కుల్దీప్ 40 పరుగులు చేసి భారత జట్టు 400 పరుగుల మైలురాయిని చేరుకోవడంలో సాయపడ్డారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహిదీ హసన్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.