IND vs NZ: మూడో వన్డే కూడా వర్షార్పణం.. సిరీస్ కివీస్ సొంతం
ABN , First Publish Date - 2022-11-30T15:18:51+05:30 IST
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే వర్షార్పణమైంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 54 బంతుల్లో..
టీమిండియా, న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగిన మూడో వన్డే (3rd ODI) వర్షార్పణమైంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ 18 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 54 బంతుల్లో 57 పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. కాన్వే 38 పరుగులు, విలియంసన్ (0) తో క్రీజులో ఉన్నారు. వర్షం పెరగడంతో ఆట ముందుకు సాగే పరిస్థితి కనిపించలేదు. దీంతో.. కొంత సమయం వేచి చూశారు. ఎంతకూ తగ్గకుండా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చేసేదేమీ లేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితం తేలని మ్యాచ్‌గా మూడో వన్డే మిగిలిపోయింది. చివరకు.. మూడు వన్డేల సిరీస్‌ను 1-0 తేడాతో న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా చెప్పుకోతగ్గ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 28 పరుగులు, మరో ఓపెనర్ గిల్ 13 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులతో రాణించాడు. పంత్ ఈ మ్యాచ్‌లో కూడా నిరాశపరిచాడు. 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 6, దీపక్ హుడా 12 పరుగులకే ఔట్ కావడం గమనార్హం. చివర్లో.. వాషింగ్టన్ సుందర్ నిలకడగా ఆడి 51 పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించాడు. ఫలితంగా.. టీమిండియా 219 పరుగులు మాత్రమే చేసి 47.3 ఓవర్లకే ఆలౌట్ అయింది.
ఆ తర్వాత.. బౌలింగ్ చేసిన టీమిండియా తొలుత కాస్త నిలువరించినట్టుగా అనిపించినా ఆ తర్వాత మాత్రం పరుగులు బాగానే సమర్పించుకున్నారు. దీపక్ చాహర్ 5 ఓవర్లలో 30 పరుగులు, ఉమ్రాన్ మాలిక్ 5 ఓవర్లకు 31 పరుగులు ఇచ్చారు. అర్ష్‌దీప్ సింగ్ 5 ఓవర్లకు 21 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లకు 16 పరుగులు ఇచ్చారు. రెండో వన్డే కూడా మూడో వన్డే మాదిరిగానే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించగా.. రెండో వన్డే వర్షంతో రద్దయింది. అయితే ఈ ఆఖరి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు తగిలి సిరీస్‌ను సమం చేయాలని ఆశపడిన టీమిండియాకు నిరాశ మిగిల్చాడు. అటు కివీస్ మాత్రం సిరీస్ దక్కిన ఆనందంలో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో కివీస్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో పదింట్లో గెలవడం విశేషం.