Pakistan: పాక్‌ గెలిచింది

ABN , First Publish Date - 2022-10-31T04:25:49+05:30 IST

టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌ బోణీ చేసింది. గ్రూప్‌-2లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్‌ గెలుపొందడంతో నెదర్లాండ్స్‌ ఇంటిబాట పట్టింది.

Pakistan: పాక్‌ గెలిచింది
Pakistan

ఆరు వికెట్లతో నెదర్లాండ్స్‌ ఓటమి

పెర్త్‌: టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌ బోణీ చేసింది. గ్రూప్‌-2లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్‌ గెలుపొందడంతో నెదర్లాండ్స్‌ ఇంటిబాట పట్టింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులే చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షాబాద్‌ ఖాన్‌ (3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. డచ్‌ టీమ్‌ ఓ దశలో 9 ఓవర్లకు 28/3 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్‌ స్టీఫెన్‌ (6) అఫ్రీది అవుట్‌ చేయగా.. ఓ డౌడ్‌ (8), టాప్‌ కూపర్‌ (1)ను షాదాబ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆరో ఓవర్‌లో రౌఫ్‌ వేసిన బంతి తగలడంతో గాయపడిన ఆల్‌రౌండర్‌ లీడ్‌ (6) రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. ఎకర్‌మన్‌ (27), ఎడ్వర్డ్స్‌ (15) ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టే ప్రయత్నం చేశారు.

అయితే, ఎకర్‌మన్‌ను అవుట్‌ చేసిన షాదాబ్‌.. ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఎడ్వర్డ్‌ను నసీమ్‌ అవుట్‌ చేసే సమయానికి 69/5తో ఉన్న నెదర్లాండ్స్‌.. 22 పరుగుల తేడాతో మిగతా 5 వికెట్లను చేజార్చుకొంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్‌ 13.5 ఓవర్లలో 95/4 స్కోరు చేసి గెలిచింది. రిజ్వాన్‌ (49) రాణించగా, బాబర్‌ ఆజమ్‌ (4) మరోసారి విఫలమయ్యాడు. కానీ, ఫఖర్‌ (20)తో కలసి రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించిన రిజ్వాన్‌.. మసూద్‌ (12)తో కలసి 30 రన్స్‌ భాగస్వామ్యంతో పాక్‌ విజయానికి బాటలు వేశాడు. జమాన్‌, మసూద్‌ను గ్లోవర్‌ పెవిలియన్‌ చేర్చగా.. రిజ్వాన్‌ను మీకెర్న్‌ అవుట్‌ చేశాడు. అయితే, షాదాబ్‌ (4 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Updated Date - 2022-10-31T04:25:51+05:30 IST