T20 World Cup Final: అత్యంత అరుదైన రికార్డు సాధించిన ఇంగ్లండ్
ABN , First Publish Date - 2022-11-13T17:48:10+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ (Pakistan)తో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ (Pakistan)తో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ (England) మరో అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. ఇంగ్లండ్ ఇప్పటికే 2019 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని మరోమారు విశ్వవిజేతగా అవతరించింది.
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఇంగ్లండ్ 137/8 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 138 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలుత తడబడినా ఆ తర్వాత కుదురుకుని విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించిన ఇంగ్లండ్ సగర్వంగా రెండో టీ20 ప్రపంచకప్ ట్రోపీని అందుకుంది. అంతేకాదు, రెండు టీ20 ప్రపంచకప్‌లతో వెస్టిండీస్ సరసన చేరింది. 2010లో పాల్ కాలింగ్‌వుడ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు టీ20 ప్రపంచకప్ అందుకుంది. 2016 ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, విండీస్ బ్యాటర్ కార్లస్ బ్రాత్‌వైట్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.