England Vs Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్
ABN , First Publish Date - 2022-12-01T18:55:54+05:30 IST
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ (Pakistan)తో ఇక్కడి రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ప్రపంచ రికార్డు సృష్టించింది
రావల్పిండి: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ (Pakistan)తో ఇక్కడి రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ప్రపంచ రికార్డు సృష్టించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించి పాక్ బౌలర్లను తుక్కురేగ్గొట్టింది. జట్టులో నలుగురు ఆటగాళ్లు ఏకంగా సెంచరీలు నమోదు చేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఫలితంగా టెస్టు మ్యాచ్ తొలి రోజునే 500 పరుగులు సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.
233 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత రెండు పరుగులకే రెండో వికెట్ చేజార్జుకుంది. మరో 50 పరుగుల తర్వాత మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాత్రం వికెట్ల కోసం పాక్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. క్రీజులో పాతుకుపోయిన ఒల్లీపోప్ సెంచరీ చేసి కానీ క్రీజును వదిలిపెట్టలేదు. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 462 పరుగులు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలిసి హారీ బ్రూక్ నిదానంగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లండ్ ఆటగాళ్లలో వరుసగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఓపెనర్లు జాక్ క్రాలీ122 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ బెన్‌డకెట్ 107 పరుగులు, ఒల్లీ పోప్ 108 పరుగులు చేశారు. మధ్యలో జోరూట్ ఒక్కడే విఫలమయ్యాడు. 23 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం హారీ బ్రూక్ (101), కెప్టెన్ బెన్ స్టోక్స్ (34) క్రీజులో ఉన్నారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి రోజు 500 పరుగులు చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 1910లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 494 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమం కాగా, ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్ తుడిచిపెట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులు రాబట్టడం మామూలు కాకపోయినా ఒకే రోజు సాధించడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో మూడుసార్లు ఇంగ్లండ్, ఒకసారి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకుపైగా సాధించాయి. 1936లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో రోజున 588 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే.