సిర్పూర్‌(టి) రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు కరువు

ABN , First Publish Date - 2022-04-18T04:01:29+05:30 IST

రాష్ట్రంలో మహారాష్ట్ర సరిహద్దున గల చివరి రైల్వే స్టేషన్‌ అయిన సిర్పూర్‌(టి) లో సమస్యలు తిష్టవేశాయి. ఈ స్టేషన్‌ నుంచి రోజూ వందసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

సిర్పూర్‌(టి) రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు కరువు
బెంచీలపై కూర్చోని రైళ్ల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు

- రోజూ వందల ప్రయాణికుల రాకపోకలు

- మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేదు

- విశ్రాంతి గదులు లేక బెంచీలపైనే అవస్థలు

- పట్టించుకోని అధికారులు, నాయకులు 

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 17: రాష్ట్రంలో మహారాష్ట్ర సరిహద్దున గల చివరి రైల్వే స్టేషన్‌ అయిన సిర్పూర్‌(టి) లో సమస్యలు తిష్టవేశాయి. ఈ స్టేషన్‌ నుంచి రోజూ వందసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూరు, చింతలమా నేపల్లి నుంచి ప్రయాణికులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, రాజురా, వీరూర్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఉత్తప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లి వస్తుంటారు. రైల్వే స్టేషన్‌లో కనీసం మహిళలకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేవు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు విశాంత్రి తీసుకోవడానికి గదులు లేక బెంచీలపైనే కాలం గడుపుతున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనీసం పక్కా స్లాబ్‌ కూడా లేదు. స్టేషన్‌ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డికి తాళం వేసి ఉంచుతున్నారు. అదే విధంగా దివ్యాంగులకు ప్లాట్‌ఫాం దాటేందుకు ర్యాంపు సౌకర్యం లేదు. రోగులు, వివిధ పట్టణాలకు వెళ్లే వారిని కుటుం బీకులు చేతుల మీద తీసుకు వచ్చి ట్రైన్‌లో ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం క్యాంటీన్‌ సైతం లేకపోవడంతో రాత్రి సమయాల్లో వచ్చే ప్రయాణికులు పస్తులండాల్సి వస్తోంది. ప్రయాణికులు వాహనాలు, ఆటోలు నిలిపేందుకు పార్కింగ్‌ స్థలం లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్‌ లేక పోవడంతో 18కిలో మటర్ల దూరంలో గల కాగజ్‌నగర్‌ పట్టణానికి వెళ్లి బుక్‌ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో రూ.100నుంచి రూ.200 అదనంగా ఖర్చు అవుతోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు, ఎంపీ స్పందించి రైల్వేస్టేషన్‌లో అన్ని సౌకార్యలు కల్పించాలని ప్రయాణి కులు కోరుతున్నారు. అలాగే సింగరేణి, రామగిరితోపాటు ఏపీ, తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపేలా ఎంపీ కృషి చేయాలని మండలవాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-04-18T04:01:29+05:30 IST