గుర్తింపు ఎన్నికలకు మార్గం సుగమం
ABN , First Publish Date - 2022-10-28T21:49:59+05:30 IST
సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికల నిర్వహణ ఇక అనివార్యం కానుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. సింగరేణిలో ఐదేళ్ల క్రితం చివరి సారిగా యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్ళకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉన్నా యాజమాన్యం ఇంతకాలం కాలయాపన చేస్తూ వస్తోంది.
మంచిర్యాల, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికల నిర్వహణ ఇక అనివార్యం కానుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. సింగరేణిలో ఐదేళ్ల క్రితం చివరి సారిగా యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్ళకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉన్నా యాజమాన్యం ఇంతకాలం కాలయాపన చేస్తూ వస్తోంది. యాజమాన్యం నాన్చుడి ధోరణిని సవాలు చేస్తూ ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
మూడేళ్లుగా సాగదీత...
సింగరేణిలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారం భం కాగా ప్రతీ రెండేళ్ళకు ఎన్నికల నిర్వహణ జరగాల్సి ఉంది. 1998, 2000 సంవత్సరాల వరకు జరిగిన ఎన్నికలకు కూడా కాల పరిమితి రెండు సంవత్సరాలే ఉండేది. 2003లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాల పరిమితి నాలుగు సంవత్సరాలకు పెంచగా 2017 వరకు అదే పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కొనసాగింది. అయితే చివరి సారిగా 2017 అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాల పరిమితిని తిరిగి రెండు సంవత్సరాలకు కుదించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా బాధ్యతలు నిర్వహించిన టీబీజీకేఎస్ కాల పరిమితి ముగిసి మూడేళ్ళు గడుస్తున్నా యాజమాన్యం సాగదీత ధోరణిని అవలంభి స్తోంది.
ఎన్నికలు అనివార్యం
ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రి య చేపడితేనే సంస్థతోపాటు అందులో పనిచేసే కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యల పరిష్కారానికి ఎన్నికలు ఒక వేదికగా నిలుస్తాయి. సింగరేణిలో ఐదు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్‌తో పాటు ప్రాంతీయ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతూ వస్తున్నాయి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మికశాఖ మంత్రితోపాటు కార్మిక శాఖ కార్యదర్శి, తదితరులకు ప్రధాన సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. కార్మిక సంఘాల ఒత్తిడికి స్పందించిన కార్మికశాఖ యూనియన్ల వారీగా వార్షిక నివేదిక సమర్పించాలని కోరింది. ఈ మేరకు గుర్తింపు ఎన్నికల్లో పాల్గొన నున్న కార్మిక సంఘాలు వార్షిక నివేదికలతోపాటు రిజిస్ర్టేషన్ ధ్రువీకరణ పత్రాలు, డిక్లరేషన్‌లు వివరాలను ఇప్పటికే కార్మికశాఖకు అందజేశాయి.
ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాసినా...!
సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సీఎండీ శ్రీధర్ జూన్ 8న లేఖ రాశారు. 2019లోనే గుర్తింపు సంఘం కాలపరిమితి తీరిపోయినా కోర్టుకు వెళ్లడం, కరోనా కారణంగానో టీబీజీకేఎస్ ఇప్పటి వరకు కొనసాగింది. ఎన్నికల నిర్వహణలో ఇంకా జాప్యం చేయడం కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రమాదంగా మారుతుందని భావించిన కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ వస్తున్నాయి. మరోవైపు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేదా టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ సంఘాలకు సమ ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐదు జాతీయ సంఘాల అగ్రనాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, రియాజ్ అహ్మద్, మంద నర్సింహారావు, యాదగిరి సత్తయ్య జూన్ 6న డైరెక్టర్‌తోపాటు డిప్యూటీ లేబర్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దీనికి స్పందించిన సీఎండీ సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సిద్ధంగా ఉందని, తదుపరి ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
డిసెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్?
హైకోర్టు ఆదేశాలతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మికశాఖ త్వరలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆదేశాల మేరకు రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) కార్మిక సంఘాలకు లేఖలు రాయడం, కార్మిక సంఘాల విజ్ఞప్తితో సీఎండీ ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ రాయడం, మరోవైపు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో డిసెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని యాజ మాన్యాన్ని మూడేళ్ళుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు. చివరి ప్రయత్నంగా జూన్‌లో గోదావరిఖనిలో అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కోర్టును ఆశ్రయిద్దామనే నిర్ణయానికి వచ్చాం. రెండు సంఘాలు నిరాకరించగా, సమ్మతం తెలిపిన మరో రెండు సంఘాలు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆగస్టు 4న హైకోర్టులో ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ హోదాలో కేసు వేశాను. చీఫ్ లేబర్, డిప్యూటీ లేబర్ కమిషనర్, ఆర్‌ఎల్‌సీ, సింగరేణి సీఅండ్‌ఎండీని పార్టీ చేశాం. రెండు సార్లు తీర్పు వాయిదా పడింది. ఎట్టకేలకు వెంటనే ఎన్నికలు జరపాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ఆర్‌ఎల్సీ హైకోర్టు ఆదేశాలను అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్నాం.