ప్రాజెక్టుల కాలువల నిర్మాణానికి తెగని భూసేకరణ సమస్య
ABN , First Publish Date - 2022-10-01T03:33:00+05:30 IST
రైతుల భూములకు సాగు నీరందించాలన్న సదుద్ధేశ్యంతో ప్రభుత్వం చేపటిన ప్రాజెక్టులు భూసేకరణ సమస్యతో ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు.
-పూర్తికాని ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం
-ఏళ్లు గడుస్తున్నా పురోగతి లేని వైనం
-పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
కాగజ్‌నగర్, సెప్టెంబరు 30: రైతుల భూములకు సాగు నీరందించాలన్న సదుద్ధేశ్యంతో ప్రభుత్వం చేపటిన ప్రాజెక్టులు భూసేకరణ సమస్యతో ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. జిల్లాలో కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటి కాల్వల నిర్మాణంలో తలెత్తిన భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది.
17ఏళ్లు దాటినా పూర్తికాని జగన్నాథ్‌పూర్ కాలువలు
కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ వద్ద 2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే లక్ష్యంతో రూ.125కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పనులపైనే దృష్టి సారించినప్పటికీ కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో భూ నిర్వాసితులు అధికంగా ఉన్నారు. వీరికి ధర నిర్ణయించటంలో అధికారులు విఫలమయ్యారు. ఇంతలో ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. దీంతో వ్యయం భారీగా పెరిగింది. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.246.49 కోట్లకు పెంచింది. ప్రస్తుతం 90శాతం పనులు పూర్తిచేశారు. కానీ కాల్వల నిర్మాణంలో అసలు సమస్య వచ్చింది. తమకు భూపరిహారం విషయంలో పూర్తి అన్యాయం చేశారని, 2005లోని పాత ధర కట్టిస్తే ఎలా తీసుకుంటామని రైతులు ఎదురుతిరిగారు. తమ పరిహారం విషయం తేల్చాకే కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని తేల్చి చెప్పడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పలుమార్లు ఈ రెండు మండలాల్లోని రైతులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోయింది. ప్రాజెక్టు పనులన్నీ కూడా గ్యామన్ ఇండియా కాంట్రాక్టర్ దక్కించుకొని సబ్‌కాంట్రాక్టర్‌తో పనులు చేయించింది. నిధుల విడుదల కాకపోవటం తదితర సమస్యలతో 17ఏళ్లుగా అలాగే వదిలేశారు. ఆరు నెలల క్రితం ఈ ప్రాజెక్టును ప్రభుత్వ కార్యదర్శి స్మితాసబర్వాల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫైల్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు ఎంత మేర కాల్వలు నిర్మించాల్సి ఉందన్న విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కాగానే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిహారం లెక్కలు తెల్చే ప్రక్రియను చేపట్టేందుకు శ్రీకారం చుట్టనున్నారు.
కుమరం భీం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు
ఆసిఫాబాద్‌లోని అడ వద్ద కుమరం భీం ప్రాజెక్టును రూ.425కోట్లతో 2009లో పూర్తి చేశారు. ఇక్కడ కూడా ప్రాజెక్టును పూర్తిచేసినా కాల్వలను మాత్రం నిర్మించలేకపోయారు. ఈ కాల్వ పూర్తి అయితే సిర్పూరు ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని రైతులు ఎంతో ఆశపెట్టుకున్నారు. కుమరం భీం ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ పనులు ప్రస్తుతం సిర్పూరు(టి) మండలంలోని వేంపల్లి వరకు వచ్చింది. పనులు పూర్తిగా నత్తనడక జరుగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కుమరం భీం ప్రాజెక్టు ఎడవ కాల్వ పనులను కాగజ్‌నగర్ మండలం మీదుగా చేపట్టాల్సి ఉండగా ఈ పనులకు అటవీశాఖ అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ సమస్య ఏర్పడింది. అలాగే రైతులు భూపరిహార సమస్య రావడంతో సంబంధిత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. అలాగే పనుల తాలుకూ నిధులు కేటాయింపులు కూడా ఆశించిన మేర జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి కాల్వ పనులు వేగంగా జరిగేలా చూడాలని రైతులంతా కోరుతున్నారు.
చాలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు
-శ్రీశైలం, కాగజ్‌నగర్
17ఏళ్లుగా జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టును ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు మాత్రం అందుకూ పూర్తి విరుద్ధం. గత పదిహేడేళ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది.
భూసేకరణే సమస్య
-కుమారస్వామి, సీఈ, ఇరిగేషన్ శాఖ
కాగజ్‌నగర్ జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణం విషయంలో భూసేకరణ సమస్య ఉంది. ఈవిషయంలో ఎంత మేర నిర్మించాల్సి ఉంది..? ఎంత భూములు కొల్పోతున్నారన్న విషయంలో సర్వేలు చేపట్టాం. అలాగే కుమరం భీం ఎడమ కాల్వ పరిస్థితి కూడా భూసేకరణపై పూర్తివివరాలు సేకరించాం. సంబంధిత కాంట్రాక్టర్‌కు కూడా సూచించాం. పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.