ఆధ్యాత్మికతకు నిలయం అయ్యప్ప ఆలయం
ABN , First Publish Date - 2022-11-16T01:11:31+05:30 IST
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణుఘోష నగరంలో మార్మోగుతుంది. శ్రీనగర్‌కాలనీ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వాహకులు శబరిమల తరహాలో ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
శ్రీనగర్ కాలనీలో నేటినుంచి మండల పూజలు
అష్టకళశాభిషేకం, లక్ష పుష్పార్చనలు
శబరిమల తరహాలో తిరువాభరణాల ఊరేగింపు
పురవీధుల్లో అయ్యప్ప గజారోహణం
20 ఏళ్లుగా కొనసాగుతున్న అన్నదానం
బంజారాహిల్స్, నవంబర్ 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం వచ్చిందంటే చాలు ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణుఘోష నగరంలో మార్మోగుతుంది. శ్రీనగర్‌కాలనీ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయంలో నిర్వాహకులు శబరిమల తరహాలో ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్తీక మాసంతో 20 ఏళ్లు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెడుతున్నారు. ప్రతి మండల కాలం లో రోజూ గణపతి హోమం, అభిషేకం, సాయంత్రం పడిపూజా కార్యక్రమాలతోపాటు అష్టకళశాభిషేకం, లక్ష పుష్పార్చన, గజారోహణం వంటి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించే మండల పూజలను బుధవారం నుంచి ప్రారంభించేందుకు నిర్వహకులు చర్యలు తీసుకున్నారు.
ప్రతిష్ఠాత్మకం గజారోహణం..
దేవాలయంలో అయ్యప్ప గజారోహణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 18న ఈ ఉత్సవం జరుగునున్నది. శబరిమలలో ప్రతి ఏడాది మకరజ్యోతి రోజున అయ్యప్పకు పందలరాజ్యం నుంచి తిరువాభరణం తీసుకువచ్చి స్వామి వారికి అలంకరిస్తారు. ఇది అయ్యప్ప భక్తులకు పెద్ద వేడుక. ఇదే తరహాలో ఇక్కడ గజారోహణం రోజున అయ్యప్ప తిరువాభరణం తీసుకువస్తారు. పెద్దపెట్టలో స్వామి వారి నగలను పెట్టి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 5లో పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరువాభరణ ఊరేగింపు నిర్వహిస్తారు. శబరిమల తరహాలో ఇక్కడ కూడా ఆభరణాలను స్వామి వారికి అలంకరించే వరకు ఆకాశంలో గద్ద తిరుగుతూ ఉంటుంది. అయ్యప్ప ఆభరణాలు అలంకరించిన అనంతరం పడిపూజామహోత్సవం నిర్వహిస్తారు. ఈ తంతు నిర్వహించేందుకు శబరిమల నుంచి ప్రత్యేకంగా తంత్రీ లు వస్తారు. ఇదేరోజు సాయంత్రం కేరళ సంప్రదాయ నృత్యాలు, విన్యాసాల మధ్య అయ్యప్ప గజారోహణం చేస్తారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు అంబారిపై పెట్టి శ్రీనగర్‌కాలనీ, ఇందిరానగర్, కృష్ణానగర్, యూసు్‌ఫగూడ, ఎల్లారెడ్డిగూడ మీదుగా ఊరేగింపు నిర్వహిస్తారు.
మండలం రోజులూ భిక్ష
అయ్యప్ప స్వామి దేవాలయానికి నిత్యం వచ్చే అయ్యప్ప దీక్షా పరులతోపాటు భక్తులకు ఇక్కడ నిత్యం అన్నదానం, సాయంత్రం అల్పాహారం అందిస్తుంటారు. 1999లో సుమారు 30మందితో అన్నదానం ప్రారంభించారు. స్పందన బాగుండటంతో ప్రతి యేటా అన్నదానం కొనసాగించాలని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ గురుస్వామి భావించారు. ఈ మేరకు 2000లో మండల పూజ ఉత్సవాల్లో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వంద, రెండు వందల నుంచి వెయ్యి మందికి చేరారు. దీక్ష తీసుకున్న ఉద్యోగులు, విద్యార్థులకు ఇక్కడి అన్నదానం వరంలా మారింది. 2008 నుంచి భిక్ష స్వీకరించే దీక్షా పరుల సంఖ్య సుమారు నాలుగు వేల మందికి చేరింది. దీంతో మణికంఠ అన్నదాన సేవా సమితి పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసి దీక్షా పరులతోపాటు వచ్చిన ఇతర భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
సంప్రదాయ బద్ధంగా పూజలు
తెలుగు, కేరళ సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ పూజాధికాలు జరుగుతుంటాయి. మండల దీక్షలు మొదలైన 20 రోజులకు అష్టకళశాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం నుంచి 108 కళశాలకు వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించిన అనంతరం దీక్షాపరులు తలపై కళశాలు పెట్టుకొని ప్రదక్షిణలు చేసి, ఆ నీటితో అయ్యప్ప మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. కేరళ వాయిద్యాల మధ్య ఈ తంతు నిర్వహిస్తారు. మండల పూజ ముగిసే ముందు అయ్యప్పకు వివిధ రకాల లక్ష పుష్పాలు తీసుకువచ్చి పూజలు చేస్తారు. డిసెంబర్ 11న అష్టకళశాభిషేకం నిర్వహించనున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం
మండల దీక్షలో ప్రత్యేక పూజలను సంప్రదాయకంగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఆధ్యాత్మిక భావనకు పెద్దపీట వేస్తూ అయ్యప్ప భజనలు, పడిపూజలు జరుపుతున్నాం. గజారోహణంలో సుమారు 15వేల మంది భక్తులకు పైగా హాజరవుతారు. ఈ తంతు కోసం శబరి నుంచి ప్రత్యేకంగా తంత్రీలను రప్పిస్తాం. అయ్యప్ప స్వామి దేవాలయం అన్నదానంను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. శుచి, రుచికరమైన ఆహారం కోసం నిరంతరం సేవా సమితి సభ్యులు శ్రమిస్తున్నారు. వంట చేసే వారు అయ్యప్ప నామస్మరణతో, మడితో పనులు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది దాతలు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు.
-శ్రీనివా్‌సశర్మ, ఆలయ అర్చకులు, గురుస్వామి