Goa Drugs: గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్‌కు బేడీలు
ABN , First Publish Date - 2022-11-06T03:23:27+05:30 IST
గోవాలో మూడు హోటళ్లు, మరో మూడు ఖరీదైన బంగళాల యజమాని.....
హైదరాబాద్ కేసులో కీలక నిందితుడు
కేసు నమోదవ్వగానే అజ్ఞాతంలోకి
బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా..
ప్రయత్నాలను తిప్పికొట్టిన హైదరాబాద్ కాప్స్
అదును చూసి, అరెస్టు చేసిన హెచ్-న్యూ టీం
అతని చిట్టాలో 50 వేల మంది ఫోన్ నంబర్లు
దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నెట్‌వర్క్
డ్రగ్స్ విక్రేతలకు హైదరాబాద్ అంటే వణుకు: సీపీ
ఎడ్విన్ అరెస్టుతో.. అతని కర్లీస్ షాక్ కూల్చివేత
హైదరాబాద్ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గోవాలో మూడు హోటళ్లు, మరో మూడు ఖరీదైన బంగళాల యజమాని..! చేసేది డ్రగ్స్ దందా.. దేశవ్యాప్తంగా 50 వేల మందితో నెట్‌వర్క్.. రోజూ రూ. కోట్లలో దందా..! పోలీసు నీడ కూడా తనను తాకకుండా, ఎక్కడికక్కడ బడా లాయర్ల నియామకం..! ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గకుండా బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా ప్రయత్నాలు..! ఇదీ గోవా డ్రగ్స్ దందా కింగ్ పిన్ ఎడ్విన్ న్యూన్స్ తీరు..! గోవాలోని అంజునా బీచ్‌లో.. తీర ప్రాంత పరిరక్షణ చట్టాన్ని అతిక్రమించి.. అక్రమ నిర్మాణాలు జరిపినా.. కూల్చివేత జోలికి వెళ్లే సాహసం చేయలేని అధికార యంత్రాంగం.. పోలీసులు..! అలాంటి ఘరనా డ్రగ్స్ సమ్మగ్లర్ ఆటను హైదరాబాద్ పోలీసులు కట్టించారు. హైదరాబాద్‌లో కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఎడ్విన్ కోసం సిటీ పోలీసులు రెండు నెలలపాటు అక్కడ కాపుకాచారు. శుక్రవారం అవకాశం దొరకగానే అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. ఏడాది మొదట్లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రీతేశ్ నారాయణ్ బోర్కర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ దర్యాప్తు విభాగం(హెచ్-న్యూ) పోలీసులు తీగలాగితే.. గోవా డ్రగ్స్ కింగ్‌పిన్‌ల డొంక కదిలింది. బోర్కర్‌కు గోవాలో డ్రగ్స్ సరఫరా చేసే కింగ్‌పిన్‌ల చిట్టా పది మంది దాకా ఉందని సీపీ వివరించారు.
వీరిలో ఇప్పటికే గోవాలోని హిల్‌టాప్ రెస్టారెంట్ యజమాని స్టీవ్‌ను అరెస్టు చేశామని గుర్తుచేశారు. బోర్కర్‌తో హైదరాబాద్‌లోని బడా కాంట్రాక్టర్లు, ఐటీ రంగానికి చెందిన వారి నెట్‌వర్క్‌ను ఇదివరకే ఛేదించామన్నారు. బోర్కర్‌కు డ్రగ్స్ అందజేస్తున్న మరో కింగ్‌పిన్, గోవాలోని కర్లీస్ షాక్ నిర్వాహకుడు ఎడ్విన్ న్యూన్స్ కోసం వేట సాగించామన్నారు. ‘‘హైదరాబాద్‌లో కేసు నమోదైన విషయం తెలియగానే ఎడ్విన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని న్యాయవాదుల ద్వారా ఇక్కడి కోర్టుల్లో ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేశాడు. వాటిని హెచ్-న్యూ పోలీసులు తిప్పికొడుతూ.. శక్తిమంతమైన కౌంటర్లు ఫైల్ చేశారు. హైకోర్టులోనూ అతనికి బెయిల్ దొరకలేదు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది’’ అని సీపీ వివరించారు. గోవాలోని అంజునా ప్రాంతంలో ఇటీవల ఓ బీజేపీ నాయకురాలి అనుమానాస్పద మృతి కేసులో ఎడ్విన్ అరెస్టయ్యాడు. ఆ కేసులో ఎడ్విన్ బెయిల్ సాధించగానే.. ఎడ్విన్‌ను లొంగిపోవాలంటూ ఇదివరకే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలతో హెచ్-న్యూ పోలీసులు రంగప్రవేశం చేశారు. అతణ్ని అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
‘‘ఎడ్విన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలోనే అతణ్ని అరెస్టు చేశాం. అయితే.. అతను తనకు కొవిడ్ ఉందంటూ సర్టిఫికెట్ చూపించి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనుమానంతో మరోమారు కొవిడ్ పరీక్ష చేయించగా.. నెగెటివ్ అని తేలింది. తప్పుడు కొవిడ్ సర్టిఫికెట్ సమర్పించడం పైనా.. గోవా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు’’ అని సీవీ ఆనంద్ వెల్లడించారు. మరో 10 మంది దాకా గోవా డ్రగ్స్ కిన్‌పిన్‌లకు హైదరాబాద్ కేసులతో సంబంధాలున్నాయని, వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. ‘‘మొదట్లో డ్రగ్స్ పెడ్లర్లు దొరికారు. వారితో దర్యాప్తును ఆపేయకుండా.. మూలాలకు వెళ్లాలని నిర్ణయించాం. ఈ క్రమంలో డ్రగ్స్ కింగ్‌పిన్‌లు దొరుకుతున్నారు. ఇప్పుడు వారికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి? అనే కోణంపై దృష్టి పెట్టాం. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడమే ధ్యేయంగా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీపీ పేర్కొన్నారు. ఎడ్విన్ ఆస్తుల చిట్టాను సేకరిస్తున్నామని, కోర్టు అనుమతితో వాటిని సీజ్ చేస్తామని వెల్లడించారు. ఇతనిపై ముందస్తు నిర్బంధ(పీడీ) చట్టాన్ని ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
వెయిటర్ ఎడ్విన్.. ఓనర్ ఎలా అయ్యాడు?
ఎడ్విన్ మొదట్లో గోవాలోని బార్లలో వెయిటర్‌గా పనిచేసేవాడు. నెమ్మదిగా డ్రగ్స్ దందాను ప్రారంభించాడు. గోవాకు వచ్చే విదేశీయులకు డ్రగ్స్ విక్రయిస్తూ.. కోట్లకు పడగలెత్తాడు. గోవాలో 3 ఖరీదైన బంగళాలు, మూడు బడా హోటళ్లకు అధిపతి అయ్యాడు. ఇతనికి 100 మంది దాకా ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇతని నెట్‌వర్క్‌లో 50 వేల మంది ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిలో 1,200 మంది తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్‌తో సంబంధాలున్నవారని పోలీసులు గుర్తించారు.
ట్రాన్స్, సైకడలిక్ స్పెషల్
గోవా అంజునా బీచ్‌లో డ్రగ్స్ విక్రయాలకు, సేవించేందుకు అనువైన ప్రదేశంగా ఎడ్విన్ నిర్వహించే కర్లీస్ షాక్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గోవాకు వెళ్లే మత్తు ప్రియులు.. కర్లీస్ షాక్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారని, ఇందులో ఎంట్రీ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000 వరకు ఉంటుంద తెలిపారు. ఇక్కడ వారాంతాల్లో నిర్వహించే సైకడలిక్, ట్రాన్స్ మ్యూజిక్ పార్టీల ద్వారా డ్రగ్స్ సేవించే వారిని ఆకర్షిస్తున్నారన్నారు
కర్లీస్ షాక్ కూల్చివేత
హెచ్‌న్యూ పోలీసులు ఎడ్విన్‌ను అరెస్టు చేయడం.. గోవా పోలీసులకు కూడా నూతనోత్సాహాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో.. ఎడ్విన్ అక్రమంగా నిర్మించిన కర్లీస్ షాక్‌ను నేలమట్టం చేశారు.
ఒక్క చాక్లెట్ ముక్కతో.. ఎనిమిది గంటల కిక్..!
గంజాయి ఆయిల్(హా్‌ష)ను చాక్లెట్లతో కలిపి.. ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపే ఘరానా డ్రగ్స్ పెడ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. నార్సింగ్‌కు చెందిన రిషీ సంజయ్ మెహతా(22) ఎంబీఏ చదువుతున్నాడు. డ్రగ్స్, గంజాయి, హాష్ ఆయిల్‌కు బానిసయ్యాడు. ఇంట్లోనే హాష్ ఆయిల్‌తో చాక్లెట్లు తయారు చేసి, ఆన్‌లైన్(స్నా్‌పచాట్)లో విక్రయిస్తున్నాడు. 10-15 ముక్కలుండే చాక్లెట్ బార్‌లను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు విక్రయిస్తుంటాడు. విడిగా అయితే.. ఒక్క ముక్కకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తాడు. ఇతనిపై హెచ్-న్యూ, ముషీరాబాద్ పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఒక్క చాక్లెట్ ముక్కను తింటే.. 8 గంటల వరకు మత్తు ఉంటుందని సీపీ వివరించారు. ఇతని ఫోన్‌లో 100 మంది కస్టమర్ల పేర్లున్నాయని, వారిలో 50ు మంది యువతులే ఉన్నారన్నారు. ఇలా డ్రగ్స్ చాక్లెట్‌కు బానిసైనవారిని గుర్తించి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సీపీ వెల్లడించారు.